పెనుబల్లి: పెనుబల్లి మండలంలోని ఉప్పలచిలకలో శనివారం ఓ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. కొత్త కారాయిగూడెంకు చెందిన జోనెబోయిన ముత్తయ్య(50) కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పుట్టింటికి వెళ్లడంతో రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురైన ఆయన ఇంట్లో ఉండలేక ఉప్పలచిలకలోని బంధువుల వద్దకు వెళ్లాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముత్తయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
● కల్లూరురూరల్: కల్లూరు శాంతినగర్‌కు చెందిన ఖమ్మంపాటి ఏసు(50) వ్యక్తి వడదెబ్బకు గురై శనివారం మృతి చెందాడు. ఆయన రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతున్నాడు. ఈక్రమాన పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఏసు కుమారుడి ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
● మణుగూరుటౌన్/మణుగూరురూరల్: మణుగూరు మున్సిపాలిటీ పరిధి సుందరయ్యనగర్‌కు చెందిన ఇర్పా నాగేశ్వరరావు (42) వడదెబ్బతో మృతి చెందాడు. సింగరేణి కాంట్రాక్ట్ విభాగంలో పైప్‌లైన్ పనులు చేసే ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన భార్య సుజాత ఫిర్యాదుతో మణుగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, భరోసా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు నాగేశ్వరరావు, లీల, గఫూర్, పాపారావు, హబీబ్, లింగయ్య రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు.
● పినపాక: మండలంలోని చింతల బయ్యారం గ్రామానికి చెందిన పొనగంటి భద్రమ్మ(53) వడదెబ్బ బారిన పడగా మృతి చెందింది. మూ డురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమెకు మణుగూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా శనివారం ఉదయం మృతి చెందిందని కుటుంబీకులు తెలిపారు.
● తల్లాడ: తల్లాడ మండలం గాంధీనగర్‌తండా వాసి శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాలోతు కృష్ణ (63) వ్యవసాయ పనులు మగించుకుని ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురయ్యాడు. 108కు సమాచారం ఇచ్చి వాహనం వచ్చేలోగా ఆయన మృతి చెందాడు.
● ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వృద్ధుడి(70) మృతదేహాన్ని శనివారం గుర్తించారు. కాల్వొడ్డు వద్ద ఆయన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించారు. సదరు వృద్ధుడు వడదెబ్బతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


