పోరుబాటలో వీఓఏలు | - | Sakshi
Sakshi News home page

పోరుబాటలో వీఓఏలు

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు

నిలిచిన మహిళా సంఘాల కార్యకలాపాలు

చుంచుపల్లి: వేతన పెంపుతోపాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో పనిచేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు (వీఓఏలు) పోరుబాట పట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈ నెల 15 వరకు సమ్మె నోటీసులతోపాటు వినతి పత్రాలు అందించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని, సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.20 లక్షల విలువైన సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలని, ట్యాబ్‌లు అందించాలని, జీఓ నంబర్‌ 58ను సవరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చకపోతే జూన్‌ 2 తర్వాత ఆందోళన ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. కాగా రెండు వారాలుగా వీఓఏలు విధులకు దూరంగా ఉండటంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

జిల్లాలో 940 మంది..

జిల్లాలో 940 మంది వీఓఏలు పనిచేస్తున్నారు. వీరు 18,597 ఎస్‌హెచ్‌జీల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. 15 ఏళ్లుగా మహిళా సంఘాల సభ్యుల సమావేశాలు, రుణ పుస్తకాల నిర్వహణ, కొత్త గ్రూపుల ఏర్పాటు తదితర విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీఓఏలకు రూ.5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయడం, మహిళా సంఘాల పేర్లను, సభ్యుల పేర్లను డేటాలో ఎంట్రీ చేయడం, సీ్త్రనిధి బ్యాంకు రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ సభలకు జనసమీకరణ వంటి విధులు నిర్వరిస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని, రూ.20 వేల వేతనం చెల్లిస్తామని, ట్యాబ్‌లను అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళా సంఘాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నాం. కానీ కనీస వేతనానికి నోచుకోవడం లేదు. మా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తాం.

–ఎస్‌కె.మైమున్నీసా, వీఓఏ, చుంచుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement