పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
డిగ్రీ కళాశాల
ప్రిన్సిపాల్‌కు డాక్టరేట్
అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బండారుపల్లి రవికి శుక్రవారం ఒడిశా రాష్ట్రంలోని శ్రీశ్రీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో ‘పంట ఉత్పాదకతపై వ్యవసాయ రుణాల ప్రభావం– తెలంగాణలో ఎంపిక చేసిన జిల్లాలపై ఒక అధ్యయనం’’అంశంపై ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధారి మొహంతా పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా రవిని పలువురు అభినందించారు.
నైపుణ్యం పెంచుకోవాలి
ఇల్లెందురూరల్: యువత నైపుణ్యం పెంచుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. మండలంలోని వైటీసీలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు, శిక్షకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తి, సాంకేతికపరమైన నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. అంతకు ముందు సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో సీ్త్రశక్తి భవనానికి శంకుస్థాపన చేశారు. మర్రిగూడెం గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పొట్టేళ్ల యూనిట్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో ధన్‌సింగ్, ఎంపీవో చిరంజీవి, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఈ–సెట్‌లో ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: టీజీ ఈ–సెట్ 2026 ఫలితాల్లో కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి మహ్మద్ రయ్యాన్ హష్మీ రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. ఈ నెల 14న పరీక్ష నిర్వహించగా, శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. హష్మీ స్టేట్‌ర్యాంక్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ కేటగిరీలో 587వ ర్యాంకు కూడా సాధించాడు. ఇతను మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


