ఖమ్మం జిల్లాలో 114 ప్రాథమిక పాఠశాలల ఎంపిక
ఖమ్మంసహకారనగర్: ప్రైవేట్ పాఠశాలల మాదిరి చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,769 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించేందుకు అనుమతించింది. ఖమ్మం జిల్లాలో 114 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం ముప్ఫై
గత విద్యాసంవత్సరం నుంచే జిల్లాలోని 30 స్కూళ్లలో ప్రీ–ప్రైమరీ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో రెండు పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద, మరో 28 పాఠశాలలు సమగ్ర శిక్ష పథకం కింద మంజూరయ్యాయి. ఇందులో సమగ్ర శిక్ష పథకం కింద కొనసాగుతున్న ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు విధులు నిర్వర్తిస్తుండగా ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన విద్యావిధానంపై ప్రత్యేక శిక్షణ కూ డా అందించారు. ఈసారి ఎంపికై న 114 ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తారు.
అన్ని వసతులతో..
ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను ఆకట్టుకునేలా ఫర్నిచర్, ఆట వస్తువులు సమకూర్చడమే కాక యూనిఫామ్ అందిస్తారు. అలాగే, గదుల గోడలపై అక్షరాలు, సంఖ్యలు, పక్షులు, జంతువుల చిత్రాలతో పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ అనుమతి తర్వాత నూతనంగా ఏర్పాటయ్యే ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించి ఫర్నిచర్ సమకూర్చనున్నారు.


