పాల్వంచరూరల్: రాత్రుళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ ప్రసాద్ కథనం మేర కు.. మండలంలోని తోగ్గూడెం సమీపంలోని మొర్రేడు వాగునుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆర్‌ఐలు నళినికుమార్, రవికుమార్‌రెడ్డి శనివారం రాత్రి దాడి చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్ చేసి, కార్యాలయానికి తరలించి, జరిమానా విధించా మని తహసీల్దార్ ప్రసాద్ వెల్లడించారు.
వన్యప్రాణుల
వేటగాళ్లు అరెస్టు
చండ్రుగొండ: వన్యప్రాణుల వేటగాళ్లను ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. చండ్రుగొండ ఫారెస్టు రేంజర్ ఎల్లయ్య కథనం ప్రకారం.. మండలంలోని కరిశెలబోడుతండా బీట్ పరిధిలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణుల వేట సాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున అందిన సమాచారం మేరకు దాడి చేసి, బానోత్ వీరన్న, ఇస్లావత్ సిత్తు, తేజావత్ రమేశ్, బానోత్ సురేశ్, బాదావత్ చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఇస్లావత్ జామ్ల పరారైనట్లు రేంజర్ ఎల్లయ్య వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన వైర్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను పోలీసులకు అప్పగించామని రేంజర్ వివరించారు.
సాగర్ కాల్వలో మునిగి వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: సాగర్ కాల్వలో కొట్టుకుపోతున్న గేదెలను అదిలించేందుకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లికి చెందిన చింతిరాల బాబు (68) ఆదివారం గేదెలను మేపుతుండగా.. అవి సాగర్ కాల్వలోకి దిగాయి. దీంతో వాటిని బయటకు అదిలించేందుకు దిగిన ఆయన లోతును గమనించకపోవడంతో నీట మునిగిపోయాడు. గట్టుపై ఉన్న స్థానికులు గుర్తించి ఇచ్చిన సమాచారంతో గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది. ఇటీవల ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని గృహ ప్రవేశం చేసిన బాబు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
దుమ్ముగూడెం: మండలంలోని వర్క్‌షాప్ గ్రామానికి చెందిన తోకల సమ్మయ్య (48) మద్యంమత్తులో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సమ్మయ్య ఉదయం పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో పురుగులమందు తాగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


