కొత్తగూడెం వస్తే.. ఉగ్గ పట్టుకోవాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం వస్తే.. ఉగ్గ పట్టుకోవాల్సిందే!

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

పోస్టాఫీస్‌ దగ్గర ముక్కు మూయాల్సిందే జీతాలు ఇవ్వలేం

బస్‌ స్టేషన్‌ దగ్గర తాళం

ప్రధాన సెంటర్లలో కూడా నిర్వహించలేని అధికారులు

కొత్త పాలకవర్గం కొలువుదీరినా మారని దుస్థితి

సర్వజన ఆస్పత్రి దగ్గర మొదలే కాలేదు

జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే కేంద్రాల్లో పోస్టాఫీస్‌ కూడా ఒకటి. ఈ సెంటర్‌ చుట్టూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు తోడుగా పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోనే పెద్దదైన ప్రకాశం స్టేడియం ఇక్కడే ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాదిగా క్రీడాకారులు ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తుంటారు. వాకర్స్‌ రద్దీ కూడా ఎక్కువే. వివిధ ప్రజా సంఘాలు ఇక్కడే ఆందోళనలు చేపడుతుంటాయి. ఎంతో రద్దీగా ఉండే పోస్టాఫీస్‌ సెంటర్‌లో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్ల మెయింటెనెన్స్‌ అధ్వాంగా ఉంది. టాయిలెట్లపై అమర్చిన ట్యాంకులు పాడైపోయాయి. తలుపులు విరిగిపోయాయి. పైగా టాయిలెట్ల గోడలపై మాత్రం ఎంతో అందంగా స్వచ్ఛ కొత్తగూడెం అనే వాల్‌రైటింగ్స్‌ దర్శనం ఇవ్వడం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం, కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలో స్వచ్ఛత కేవలం వాల్‌ రైటింగ్‌కే పరిమితమైంది. పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు కూడా నూతన పాలకవర్గం ఆపసోపాలు పడుతోంది. కొత్తగూడెం మున్సిపల్‌ కౌన్సిల్‌ పదవీ కాలం 2025 జనవరిలో ముగిసింది. ఆ తర్వాత అధికారుల పాలనే కొనసాగింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు సుజాతనగర్‌ మండలంలో ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ 2025 మార్చి 24న కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్నికలు నిర్వహించగా, 2026 ఫిబ్రవరి 16న కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. మూడ్‌ గణేశ్‌ కొత్తగూడెం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినా, కొత్త పాలకవర్గం కొలువుదీరినా పరిస్థితి మెరుగుపడలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయి రెండు నెలలైనా పాత అధికారుల జమానానే కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.

కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 21 పబ్లిక్‌ వాష్‌రూమ్‌లు/టాయిలెట్లు ఉన్నాయి. అన్నింటి నిర్వహణ అథమంగానే ఉంది. కార్పొరేషన ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో నిత్యం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనీసం టాయిలెట్లు కూడా నిర్వహించలేని దుస్థితిలో నగర పాలకవర్గం ఉంది. ఈ అంశంపై వివరణ కోసం ప్రయత్నించగా.. కార్పొరేషన్‌ కమిషనర్‌ సుజాత ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. మేయర్‌ గణేస్‌ స్పందిస్తూ.. జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో టాయిలెట్లను అందుబాటులో ఉంచలేకపోయామని వెల్లడించారు.

సాధారణంగా ఏ పట్టణం/నగరంలోనైనా జనసమ్మర్థం ఉండే ప్రాంతం బస్‌ స్టేషన్‌. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్‌ స్టేషన్‌కు వచ్చి పోతుంటారు. కొత్తగూడెం బస్‌ స్టేషన్‌ నుంచి నిత్యం 550 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. 28 వేల మంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు. దీనికితోడు ఇక్కడే ట్యాక్సీ స్టాండ్‌, ఆటో స్టాండ్‌ కూడా ఉన్నాయి. ఇంతటి రద్దీ ఉండే ప్రాంతంలో కూడా బాత్‌రూమ్‌ కమ్‌ టాయిలెట్లను అందుబాటులోకి తేవడంలో కార్పొరేషన్‌ పాలకవర్గం విఫలమైంది. ఆధునిక సౌకర్యాలతో నవభారత్‌ సంస్థ ఇక్కడ వాష్‌రూమ్స్‌/టాయిలెట్లు నిర్మించింది. అయితే నాలుగు నెలలుగా మూతపడి ఉంది. దీంతో బస్టాండ్‌కు వచ్చిపోయే వారు ఇక్కడ వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. ఒకటికి రెండుకు అర్జంటైన వారు ట్యాక్సీ స్టాండ్‌ పక్కన తుప్పల్లోకి వెళ్లాల్సి వస్తోంది.

జిల్లా కేంద్రంలో అధ్వానంగా పబ్లిక్‌ టాయిలెట్లు

జిల్లాలో 230 పడకలతో అతి పెద్ద ప్రభుత్వాస్పత్రిగా కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి గుర్తింపు ఉంది. నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన వారు కనీసం యాభై మంది ఈ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. సమీపంలోనే కొత్తగూడెం ఫుడ్‌ కోర్ట్‌ (కేఎఫ్‌సీ) పేరుతో 14 దుకాణాలను మహిళా సంఘాలకు కేటాయించారు. రద్దీగా ఉండే ఆస్పత్రి దగ్గర ఐదేళ్ల క్రితం వాష్‌రూములు, టాయిలెట్ల కాంప్లెక్స్‌ నిర్మించారు. కానీ నేటికీ అందుబాటులోకి తేలేదు. దీంతో ఇటు ఆస్పత్రికి వచ్చేవారు, అటు కేఎఫ్‌సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement