సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

అట్రాసిటీ

కేసులు

సూపర్‌బజార్‌కొత్తగూడెం)/చుంచుపల్లి/జూలూరుపాడు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 40 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. జాప్యం చేయకుండా చార్జిషీట్లు దాఖలు చేయాలని, బాధితులకు చట్టపరమైన రక్షణతోపాటు ప్రభుత్వ పరిహారం సతర్వమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష

కలెక్టర్‌ అంకిత్‌ తహసీల్దార్లు, ఎంపీడీలు, మున్సిపల్‌ కమిషనర్లు, గృహ నిర్మాణ శాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలపై ఆరా తీశారు. నిర్మాణాలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి అయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇసుక కొరత, రవాణా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కారం చూపించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.

అటవీ అధికారులతో..

అటవీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ అటవీ, అసైన్డ్‌ భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పంచాయతీలను మోడల్‌గా తీర్చిదిద్దాలి

ప్రతీ గ్రామపంచాయతీని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించగా, కలెక్టర్‌ అంకిత్‌ పరిశీలించారు. జూలూరుపాడు రైతు వేదికలో నిర్వహించిన మండలస్థాయి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం జూలూరుపాడు సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు నిల్వలపై ఆరా తీశారు. కరివారిగూడెంలో మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించి, తాగునీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి చూపు స్పష్టంగా లేకపోతే రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రతి డ్రైవర్‌ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు.

సమస్యల గుర్తింపు, పరిష్కారం

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించే ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతున్న దృష్ట్యా రైతులు ముందుస్తుగా బుకింగ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. అనంతారం గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఉండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు విన్నవించగా.. గ్రామానికి సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి శ్రీలత, జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్‌, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్‌, కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధామోహన్‌, తహసీల్దార్‌ టి.శ్రీనివాస్‌, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ టి.తులసిరామ్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు సామ్యా నాయక్‌, లకావత్‌ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement