‘నారీశక్తి వందన్ అధినియం’పై
అతివల్లో హర్షం
ఏళ్ల నాటి ఆకాంక్షకు ప్రతిరూపమని వెల్లడి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుతో రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరిగి వారి స్వరానికి విలువ, సమాజ అభివృద్ధిలో పాత్ర మరింత బలపడుతుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అన్నది దేశాభివృద్ధికి ముందడుగుగా చెప్పాలి. –డాక్టర్ నీలిమ, భద్రాచలం
ఖమ్మంమయూరిసెంటర్/భద్రాచలంఅర్బన్: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నూతన అధ్యాయానికి అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ అంశానికి తుది రూపం ఇస్తూ.. ‘నారీశక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యాన బిల్లుపై చర్చించి ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడమే లక్ష్యమైన ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుతో మూడో వంతు సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లలోనూ 33 శాతాన్ని ఆయా వర్గాల మహిళలకే కేటాయిస్తారు.
1996లో తొలిసారి..
1996లో నాటి ప్రభుత్వం హయాంలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు ప్రయత్నించినా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ బిల్లుకు ‘నారీశక్తి వందన్ అధినియం’ అని పేరు పెట్టి మహిళా సాధికారతకు అత్యవసరమని చెబుతూ ఆమోదానికి సమావేశాలు నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయాత్మకమైన ముగింపు ఇవ్వనున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇది కేవలం చట్టాన్ని చేయడం మాత్రమే కాదు, కోట్లాది మంది మహిళల కలలను సాకారం చేసే దిశగా వేసే బలమైన అడుగుగా పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లోని వివిధ రంగాల మహిళలను పలకరించగా బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు..
పార్లమెంట్‌లో బిల్లుతో
చారిత్రక అడుగు


