● గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నెలన్నర విరామం ● మైనార్టీ విద్యాసంస్థల్లో అమల్లోకి నిర్ణయం ● తిరిగి జూన్‌లో విధుల్లోకి తీసుకుంటామని అధికారుల వెల్లడి
ఖమ్మం మయూరిసెంటర్: గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కనపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు పనిచేసే పది నెలలే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో వీరి సేవలు వినియోగించుకోనందున వేతనం చెల్లించొద్దనే భావనతో విధులకు విరామం ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి గతనెల 31నుంచి, పాఠశాలల్లో ఈనెల 24నుంచి విరామం అమలుకానుంది. అయితే, ఇది నిబంధనల ప్రకారం ఇచ్చే విరామమే తప్ప ఎవరినీ తొలగించడం లేదని మైనార్టీ గురుకులాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగతా గురుకుల సొసైటీల్లో కూడా ఈ నిర్ణయం అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ కాకపోవడంతో..
ఏటా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చే విరామంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కానందున ప్రస్తుతానికి పక్కనపెట్టి జూన్ 1వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై పడుతుందని అంచనా. ఇందులో నాన్ – టీచింగ్ సిబ్బంది 70 మంది, బోధన విభాగంలో 30 మంది ఉంటారని తెలిసింది. ఇటీవలే ఉపాధ్యాయుల నియామకం జరగడంతో ఔట్‌సోర్సింగ్ టీచర్ల సంఖ్య తగ్గింది.
వీరికి మినహాయింపు
గురుకులాల్లో అత్యవసర విధులను దృష్టిలో ఉంచుకుని కొందరికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆఫీస్ సూపరింటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రిన్సిపాళ్లు మాత్రం యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. అంతేకాక భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, పరిశుభ్రత కోసం స్కావెంజర్లు కూడా విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.


