శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి తప్పనిసరి

డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్‌

బూర్గంపాడు: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇబ్బందులు ఎదురవుతాయని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మోరంపల్లి బంజర పీహెచ్‌సీ ఆధ్వర్యాన బూర్గంపాడు కేజీబీవీలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. శారీరక శ్రమ తగ్గడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తొలుత బూర్గంపాడు ప్రధాన కూడలి నుంచి కేజీబీవీ వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌, డీపీఎంఓ మోహన్‌, ఎంపీహెచ్‌ఈఓ రవి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

13న ప్రభుత్వ

ఐటీఐలో అప్రెంటిస్‌ మేళా

రుద్రంపూర్‌: చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13న అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఐటీఐ పూర్తిచేసిన వారికి వివిధ పరిశ్రమల్లో అప్రెంటిస్‌ అవకాశం కల్పించేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న జిల్లాలోని అభ్యర్థులు www. apprenticeshipindia. org. in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని, ఆ కాపీతో పాటు బయోడేటా, విద్యార్హత పత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు.

పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌!

వాట్సాప్‌ సాయంతో సమాధానాలు

రాసిన విద్యార్థి

కొత్తగూడెంఅర్బన్‌/సుజాతనగర్‌: జిల్లాలో ఎస్సెస్సీ విద్యార్థి ఒకరు సెల్‌ఫోన్‌ సాయంతో పరీక్ష రాస్తుండడం బయటపడింది. పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. ఈమేరకు సుజాతనగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ కేంద్రంలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌ తీసుకొచ్చి వాట్సప్‌ ఆధారంగా సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌ గుర్తించారు. ఈమేరకు విద్యార్థిని డిబార్‌ చేసి మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్లు డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. అయితే, సదరు విద్యార్థి ముందు రోజే కేంద్రానికి సెల్‌ఫోన్‌ తీసుకొచ్చి దాచినట్లు తేలింది. అంతేకాక ముందుగా సిద్ధం చేసుకున్న జవా బులను వాట్సాప్‌లో చూస్తూ రాశాడని గుర్తించినట్లు సమాచారం. కాగా, మంగళవారం పరీక్షకు జిల్లాలో 12,728 మంది విద్యార్థులకు గాను 12,700 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు.

10నుంచి

డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016 కంటే ముందు డిగ్రీ చదివి ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11వ తేదీల్లో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12, 13వ తేదీల్లో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షల వివరాల కోసం 91605 38938నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement