స్టాప్‌లు స్మార్ట్‌గా! | - | Sakshi
Sakshi News home page

స్టాప్‌లు స్మార్ట్‌గా!

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

రెండు మోడళ్లలో ప్రతిపాదన..

ఏడు ప్రాంతాలు గుర్తింపు

వేసవిలోనూ చల్లదనాన్ని ఇచ్చేలా ‘మిస్టింగ్‌’ సిస్టమ్‌

ఆధునికత, సౌకర్యాలు

అత్యాధునిక చెక్‌పోస్టులు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని ఏడు ప్రాంతాల్లో రెండు రకాల అత్యాధునిక బస్‌షెల్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈమేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐయూఎం) ప్రతినిధులు ఇప్పటికే మూడు డిజైన్లతో పాటు నిర్మాణ అంచనాలను కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు అందజేశారు. కేవలం కాంక్రీట్‌ కట్టడాలుగా కాకుండా పర్యావరణహితంగా, స్మార్ట్‌ ఫీచర్లతో ఈ షెల్టర్లు రూపుదిద్దుకోనున్నాయి. బస్‌ షెల్టర్లతో పాటు ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద సెక్యూరిటీ క్యాబిన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు.

‘వెర్నాక్యులర్‌’ ఎలా ఉంటుందంటే...

పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునేలా ‘డిజైన్‌ అవేర్‌’ సంస్థ ప్రత్యేకంగా వెర్నాక్యులర్‌ బస్‌ షెల్టర్‌ నమూనా రూపొందించింది. స్టీల్‌ స్ట్రక్చర్‌పై వెదురు సూపర్‌ స్ట్రక్చర్‌, కాన్వాస్‌ కవర్‌తో షెల్టర్‌ నిర్మిస్తారు. అంతేకాక వేసవిలో ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చేలా మిస్టింగ్‌ సిస్టమ్‌(నీటి తుంపర్ల వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం షెల్టర్‌పై 2వేల లీటర్ల నీటి ట్యాంకు అమర్చుతారు. ఒక్కో షెల్టర్‌ 5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఉండి, చుట్టూ ప్లాంటర్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌, స్టోన్‌ క్లాడింగ్‌తో ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో షెల్టర్‌ నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

మెట్రో లుక్‌

ఈ– ఫ్రాస్కేప్స్‌ సంస్థ మెట్రో నగరాల తరహా రూపును ఇచ్చేలా ఎంఎస్‌ స్ట్రక్చర్‌ బస్‌షెల్టర్లను డిజైన్‌ చేసింది. 15 అడుగుల ఎత్తుతో ఉండే ఈ షెల్టర్లకు 10 ఎంఎం మందపాటి మల్టీవాల్‌ పాలీ కార్పొనేట్‌ షీట్‌తో కప్పు నిర్మిస్తారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలతో పాటు రద్దీ సమయంలో ఆసరా కోసం స్టాండింగ్‌ బెంచీలు కూడా ఉంటాయి. మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చేలా ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ఈ మోడల్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణానికి రూ.6లక్షల చొప్పున వ్యయం కానుండగా.. నాలుగు ప్రాంతాలను గుర్తించారు.

ఏడు ప్రాంతాల ఎంపిక

వెర్నాక్యులర్‌ రూపుతో పాటు ఎంఎస్‌ స్ట్రక్చర్‌లో బస్‌ షెల్టర్ల నిర్మాణానికి కేఎంసీ అధికారులు ప్రధాన ప్రాంతాలను గుర్తించారు. వెర్నాక్యులర్‌ డిజైన్‌తో ఐటీ హబ్‌, ప్రభుత్వ ఆస్పత్రి, ఖానాపురం ఎన్నెస్సీ కెనాల్‌ బ్రిడ్జిపై షెల్టర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక ఎంఎస్‌ స్ట్రక్చర్‌తో బల్లేపల్లి స్టేజీ, ఇందిరానగర్‌ పర్ణశాల, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళా శాల, ఇల్లెందు క్రాస్‌లోని విద్యుత్‌శాఖ స్టోర్‌ వద్ద నిర్మించనున్నారు.

ఖమ్మంలో అత్యాధునిక

హంగులతో బస్‌షెల్టర్లు

ఖమ్మం అభివృద్ధితో పాటే మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధునాతన హంగులు, సౌకర్యాలతో కూడిన బస్‌ షెల్టర్లు నిర్మించనున్నాం. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్చర్లు ఇప్పటికే నమూనాలు సమర్పించారు. త్వరలోనే వీటి నిర్మాణాలను ప్రారంభిస్తాం.

– అభిషేక్‌ అగస్త్య, కమిషనర్‌, కేఎంసీ

బస్‌ షెల్టర్లతో పాటు భద్రతను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో సెక్యూరిటీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఉన్న ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సెక్యూరిటీ గదిని మోడల్‌ క్యాబిన్‌గా తీర్చిదిద్దుతారు. వుడ్‌ కాంపోజిట్‌ రాఫ్టర్లతో నిర్మించే ఈ క్యాబిన్‌కు రూ.5లక్షలు వ్యయం అవుతుంది. ప్రతిపాదిత మూడు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఖమ్మం స్మార్ట్‌ సిటీగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement