జిల్లాలో కొన్ని ఘటనలు..
వేటగాళ్లకు బలవుతున్న అడవి జంతువులు
ప్రమాదకరంగా విద్యుత్ తీగలతో జీవుల వధ
వేసవిలో నిత్యకృత్యంగా మారుతున్న వైనం
గత నాలుగేళ్లలో 50 పైగానే కేసులు నమోదు
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ శివారులో ఈనెల 2న తాగునీటి కోసం బయటకు వచ్చిన రెండు దుప్పులు వస్త్రం సమ్మయ్య, కారెంగుల సాంబయ్య పెట్టిన ఉచ్చుల్లో పడ్డాయి. వీటిని చంపగా అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, వేసవి మొదలుకాగానే దాహంతో బయటకు వచ్చే వన్యప్రాణులను హతమార్చడం సాధారణమైపోయింది.
చుంచుపల్లి: వేసవి ఆరంభంలోనే జిల్లాలో వన్యప్రాణుల వేట మొదలైంది. ఉచ్చులు, విద్యుత్ వైర్లను అమర్చి, వేటగాళ్లు అటవీ జంతువులను చంపతున్నారు. నదులు, చెరువులు, వాగుల వద్ద పొదల్లో ఉరులు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. జంతువుల వేటకు ఎక్కువగా ప్రమాదకరమైన విద్యుత్ తీగలనే వాడుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సిబ్బంది నిర్లక్ష్యం, రాత్రిపూట అటవీ ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో వేటగాళ్లకు అనుకూలంగా మారుతోంది. విద్యుత్ తీగలు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలూ తీస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోళ్లు, చర్మం విక్రయిస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతం జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవి పిల్లులు, ముంగీసలు, ఇతర జంతువులకు అనువుగా ఉంది.
వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు
జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచడం, వేటాడటం పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. జంతువులను వేటాడే వారికి ఏడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా.. నేరాన్ని బట్టి ఈ రెండింటినీ ఏకకాలంలో అమలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. కొన్ని జంతువులను వేటాడితే బెయిల్ కూడా లభించదు. గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తే హాని తలపెట్టకుండా అధికారులకు తెలపాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో రాత్రి సమయాల్లో దప్పిక తీర్చుకునేందుకు నీటి వనరులను అన్వేషిస్తూ గ్రామాల సరిహద్దుల్లోకి జంతువులు రావటం సాధారణంగా మారింది. ఇదే అదునుగా వేటగాళ్లు నీటి కుంటలు, ప్రధాన కాల్వల వద్ద విద్యుత్ వైర్లు, ఉచ్చులు ఏర్పాటు చేసి వధిస్తున్నారు. విద్యుత్ తీగలు అమర్చడంతో మనుషులు, పశువుల ప్రాణాలు కూడా పోతున్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిన్నెరసాని, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, దమ్మపేట, చంద్రుగొండ, దుమ్ముగూడెం, పినపాక, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో నాలుగేళ్లలో 50 కేసులకుపైగా నమోదయ్యాయని అటవీ అధికారులు తెలిపారు.
వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం వస్తుంటాయి. వేటగాళ్లు కరెంట్ తీగలు, ఉచ్చులు అమర్చి వేటాడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. అటవీ జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచుతాం. వేటకు పాల్పడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం.
–కిష్టాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి
2021 డిసెంబర్‌లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన తండ్రీకొడుకులు ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్ వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు.
2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్‌కుమార్ చుంచుపల్లి మండలం పెనుబల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు.
2023 మార్చిలో ఫారెస్ట్ స్పెషల్ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
సుజాతనగర్ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి చనిపోయింది.


