భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్–సీఎస్సార్ జీవీ కిరణ్ కుమార్ తెలిపారు. ఏర్పాట్లపై బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లాయీస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల నిర్వహణకు యాజమాన్యం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిందన్నారు. సింగరేణీయులందరూ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల బాధ్యులు అంతోటి నాగేశ్వర్ రావు, జి.లింగమూర్తి, బి.నాగేశ్వర రావు, డి.పంతులా, జి.రమేష్, కే.హాతిరామ్, డాక్టర్ మాలతి, వి.మురళి, హరిశంకర్ రావు, అధికారులు కేసా నారాయణరావు, బి.శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, జి.వెంకటేశ్వర్లు, కే.వి.ప్రకాష్, ఏ.భాస్కర్‌రావు, ఎం.రాంబాబు పాల్గొన్నారు.
సింగరేణి ఆస్పత్రిలో
వైద్య సేవలపై ఆరా
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి బుధవారం సింగరేణి ఆస్పత్రిని సందర్శించారు. పీడియాట్రిక్, మెటర్నిటీ వార్డుల్లో తనిఖీ లు నిర్వహించారు. నియోనేటల్ కేర్ తదితర వార్డుల్లో రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి వైద్యాధికారులు కిరణ్ రాజ్‌కుమార్, ఉష, అవి నాష్, విశ్వమేథి, అజమ్‌బోస్లే, లలిత పాల్గొన్నారు.
రేపు ఆదివాసీ సమ్మేళనం
హాజరుకానున్న రాష్ట్ర మంత్రి సీతక్క
భద్రాచలం టౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్‌లో ఈ నెల 10న ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం, కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక బాధ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


