దశాదిశ లేని సమావేశం | - | Sakshi
Sakshi News home page

దశాదిశ లేని సమావేశం

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

మొక్కుబడిగా సాగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ సమావేశం

గత సమావేశ అజెండా అంశాలపైనే ప్రధానంగా చర్చ

హాజరుకాని కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని, రాందాస్‌

మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి

చుంచుపల్లి: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించాల్సిన దిశ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆలస్యంతో ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా మొదలైంది. కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ సమావేశానికి హాజరు కాలేదు. ఖమ్మం ఎంపీ, దిశ చైర్మన్‌ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ కో చైర్మన్‌గా పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తూతూ మంత్రంగానే నిర్వహించారు. సమావేశం దాదాపు మూడు గంటలపాటు కొనసాగగా, ఎక్కడా కొత్త పథకాల అమలు, కేంద్రం నుంచి రాబట్టే నిధుల ప్రస్తావన కూడా రాలేదు. గతంలో చేసిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ఆగిపోయిన పనులపైనే కొంతమేర చర్చించి వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో టెక్నికల్‌ సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు శాఖల వారీగా నివేదికలను చదివి వినిపించారు. కొందరు అధికారులు మాత్రం ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం సైతం చెప్పకుండా దాటవేశారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పూర్తికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, ఇల్లెందు, అశ్వారావుపేటల మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు దొడ్డ కిరణ్‌ మిత్ర, శశికళ, వివిధ శాఖల అధికారులు విద్యా చందన, నాగలక్ష్మి, మధు, కృష్ణా గౌడ్‌, దిశ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఎంపీ రఘురాంరెడ్డి

జిల్లాలో అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేదని, ప్రస్తుతం 60 శాతం మాత్రమే ఇచ్చేలా మార్పులు చేపట్టిందని తెలిపారు. మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్‌ వంటి ప్రాథమిక సేవలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న సేవలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పైప్‌లైన్‌ లీకేజీలను నివారించాలన్నారు. మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement