ఉచ్చు బిగుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

ఉచ్చు బిగుస్తోంది..

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

● ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్‌ ● ‘సైబర్‌’కేసులో 48కి చేరిన అరెస్టుల సంఖ్య

● ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్‌ ● ‘సైబర్‌’కేసులో 48కి చేరిన అరెస్టుల సంఖ్య

సత్తుపల్లి: అమాయకుల నుంచి రూ.కోట్లలో దండుకున్న వారిపై నమోదైన సైబర్‌ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మూల్‌ అకౌంట్లు ఇచ్చి ఆర్థిక నేరాలకు సహకరించిన ముగ్గురు బ్యాంకు ఉద్యోగులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిబ్రవరి 24న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉడతనేని వికాస్‌ చౌదరితో పాటు 14 మంది పేర్లతో కేసు నమోదైంది. ఇదే కేసులో భద్రాద్రి జిల్లా చండ్రుగొండ సీఎస్‌బీ బ్యాంక్‌ మేనేజర్‌ అఖిల్‌ అబ్దుల్‌కు సహకరించిన కస్టమర్‌ రిలేషన్‌ ఆఫీసర్లు ఓర్సు కృష్ణ(బెండాలపాడు, చండ్రుగొండ మండలం), మందా శ్రీహరిబాబు(బయ్యన్నగూడెం, పెనుబల్లి మండలం), బ్రాంచ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ జుంజునూరి రాధాకృష్ణ(మద్దుకూరు, చండ్రుగొండ మండలం)ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

తొలుత సైబర్‌ మోసంలో రూ.547 కోట్లు లావాదేవీలు జరిగినట్లు భావించినా, విచారణ తర్వాత భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈమేరకు పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్‌ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి(మనోజ్‌ కల్యాణ్‌ బినామీ) ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహా కృష్ణ(కరీంనగర్‌) ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్‌చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఈ నగదుతో నిందితుల కూడబెట్టిన ఆస్తులను జప్తు చేసేందుకు పోలీసులు ఇప్పటికే రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. అంతేకాక ఆస్తుల పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. కాగా, కల్లూరు డివిజన్‌ పరిధిలో నమోదైన రెండు సైబర్‌ క్రైం కేసుల్లో ఇప్పటివరకు 48 మందిని అరెస్ట్‌ చేశారు. అలాగే, కమీషన్లకు ఆశ పడి 130 మంది మూల్‌ అకౌంట్లు ఇచ్చినట్లు తేలిన నేపథ్యాన ఎప్పుడు ఎవరిని అరెస్ట్‌ చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈవిషయమై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌ మాట్లాడుతూ సైబర్‌ కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు సంబంధిత శాఖలకు లేఖలు రాశామని వెల్లడించారు. నేరాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోమని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement