లేబర్ కోడ్‌లు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయా లని నిర్ణయించడం కార్మిక వ్యతిరేకమని, కార్పొరేట్ల సంపద పెంపు కోసం 145 కోట్ల ప్రజలకు, 70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధమవడమేనని కార్మిక సంఘాల నాయకులు ఎస్‌ఏ జలీల్, జె.సీతారామయ్య, కంచర్ల జమలయ్య, దొడ్డా రవికుమార్, షేక్ యాకుబ్‌షావలి అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యావత్ కార్మిక వర్గం లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె నిర్వ హించి వ్యతిరేకత చాటినప్పటికీ మోదీ ప్రభుత్వం.. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్లు, పెట్టుబడి దారులకు సంపదను కట్టబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు లేబర్ కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తూ బ్లాక్ డే జరపాలని పిలుపునిచ్చాయని, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ కోడ్‌లతో యూనియన్ పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు, సమ్మె హక్కు ఉండవని, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని, 8 గంటల పనివిధానం పోయి 14 గంటలు రానుందన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయమని ప్రకటించాయని, రాష్ట్రంలో కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు త్యాగరాజన్, కాయల నాగభూషణం, పీతాంబరం, గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, మల్లికార్జున్‌రావు, భూక్య రమేశ్, కె.సత్య, తులసీరామ్, మధుసూదన్‌రెడ్డి, సతీశ్, వెంకన్న, ఎం.రాజు, ఎం.వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శిరీష, పద్మ, వాణి, క్రాంతి, మాధవి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
కలెక్టరేట్ ఎదుట నిరసనలో
కార్మిక సంఘాల నేతలు


