వైభవంగా చండీహోమం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చండీహోమం

Apr 2 2026 7:59 AM | Updated on Apr 2 2026 7:59 AM

పాల్వంచరూరల్‌: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలోని యాగశాలలో బుధవారం చండీ హోమం పూజలు నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ చండీహోమం జరిపారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న 15 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

భద్రగిరికి ఏటేటా

పెరుగుతున్న భక్తులు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దర్శనానికి భద్రగిరికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాచలం దారి పడుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 26.75 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. 2024–25 సంవత్సరంలో 23.51 లక్షల మంది దర్శించుకున్నారు. కాగా 2026 మేలో స్వామి వారిని 2.54 లక్షల మంది దర్శించుకోగా, గతేడాది మేలో 1.97 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు.

4న అథ్లెటిక్స్‌ ఎంపికలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు రామవరం సాధన మైదానంలో జిల్లా సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలకు పోటీలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కే మహీధర్‌ బుధవారం తెలిపారు. ఈ పొటీల్లో ప్రతిభ చూపినవారిని ఈనెల 11న హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలకు పోటీలు ఉటాయని, వివరాలకు 99486 01361 నంబరులో సంప్రదించాలని సూచించారు.

రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎంపిక

కొత్తగూడెంఅర్బన్‌/సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెంలో బుధవారం జిల్లా రైస్‌ మిల్ల ర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. రాబోయే మూడేళ్ల కాలానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జుగల్‌ కిషోర్‌ ఖండేల్‌వాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా ఏలిపిద్ది శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా పల్ల పోతు శ్రీనివాసుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్‌, అదనపు కలెక్టర్లను కలిసి కార్యవర్గ వివరాలను వెల్లడించారు. కాగా, జిల్లా రైస్‌ మిల్‌ పరిశ్రమ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా తెలిపింది.

పెరిగిన ఆయిల్‌పామ్‌ ధర

అశ్వారావుపేటరూరల్‌: ఆయిల్‌పామ్‌ గెలల ధర కొద్ది నెలలుగా పెరుగుతోంది. తాజాగా రేటు భారీగా పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో టన్ను గెలల ధర రూ.21,546 ఉండగా, ప్రస్తుతం రూ.1,459 పెరిగింది. దీంతో టన్నుకు రూ. 23,005 చొప్పున రైతులకు చెల్లించనున్నారు.

డీఈఓ ఆకస్మిక తనిఖీ

పాల్వంచ: పాల్వంచలోని వికలాంగుల కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. హెచ్‌ఎం రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement