ముగిసిన తునికాకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తునికాకు టెండర్లు

Apr 2 2026 7:59 AM | Updated on Apr 2 2026 7:59 AM

● మొదలైన మోడెం కొట్టే పనులు ● వేసవిలో గిరిజన కూలీలకు ఉపాధి

● మొదలైన మోడెం కొట్టే పనులు ● వేసవిలో గిరిజన కూలీలకు ఉపాధి

పాల్వంచరూరల్‌: తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ ముగింది. ఆకు చిగురించడంకోసం నిర్వహించే మోడెం(ప్రూనింగ్‌) కొట్టే పనులను చేపట్టారు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, వైల్డ్‌లైఫ్‌, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డివిజన్ల పరిధిలోని 31 యూనిట్లలో 25,900 స్టాండర్డ్‌ బ్యాగులు లక్ష్యంగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఐదుసార్లు టెండర్లు నిర్వహించగా కొత్తగూడెం డివిజన్‌లోని కనకగిరి యూనిట్‌లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ తునికాకు సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కనకగిరి మినహా 30 యూనిట్లలో తునికాకు సేకరణను కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు.

పది రోజులపాటు మోడెం పనులు

టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆయా డివిజన్లలో అగ్రిమెంట్‌ చేసుకుని తునికి చెట్ల కొమ్మ (మోడెం) కొట్టే పనులను చేపట్టారు. వారం పది రోజులపాటు అటవీ ప్రాంతాల్లో మోడెం కొట్టే పనులు నిర్వహించనున్నారు. మోడెం కొట్టాక నెల రోజులకు ఆకు చిగిరించి కోతకు సిద్ధమవుతుంది. ఈ నెల చివరి వారం నుంచి తునికాకు సేకరణ జరగనుంది.

గిరిజనులకు ఆదాయ మార్గం

వేసవి కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లోని వేలాది మంది కూలీలకు ఉపాధిని కల్పించే తునికాకు సేకరణకు అటవీశాఖ ఈ ఏడాది ముందస్తుగానే పనులను వేగవంతం చేస్తోంది. గతేడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహిచండంతోపాటు ఆకు సేకరణ సమయంలోనే అకాల వర్షాలు కురవడంతో నిర్దేశించిన ఆకు లక్ష్యం ఎరవేరలేదు. దీంతో గుత్తేదారులకు, ఆటవీశాఖకు, కూలీలకు నష్టం వాటిల్లింది.

యూనిట్‌కు 200మందికి పైగా..

ఏప్రిల్‌, మే నెలల్లో తునికాకు సేకరణకు జిల్లాలో పదివేల మందికి పైన కూలీలు ఉపాధి కోసం శ్రమిస్తారు. ఒక్కో యూనిట్‌లో 200 నుంచి 300 మంది వరకు తునికాకు సేకరణ జరుపుతున్నట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. సేకరించాక 50 ఆకులను ఒక్క కట్టగా కడతారు. ఇలా కట్టిన ఆకుల కట్టలను కల్లాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. కాంట్రాక్టర్‌ కట్టకు రూ.1.40 చొప్పున చెల్లిస్తారు. నాణ్యమైన తునికాకు కోసం ఆకు ఫ్రూనింగ్‌ పనులు (కొమ్మ కొట్టడం) కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement