● యూజర్ చార్జీలు రెట్టింపు చేసిన ప్రభుత్వం ● 3 నుంచి 5 వ తేదీ వరకు సేవల్లో అంతరాయం
సూపర్‌బజార్(కొత్తగూడెం)/సుజాతనగర్: మీ సేవ కేంద్రాల్లో యూజర్ చార్జీలు పెరిగాయి. ఈ నెల ఒకటి నుంచి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవ దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండు రకాలు ఉండగా, రెండింటిలోనూ చార్జీలు పెంచారు. కేటగిరీ–ఏ దరఖాస్తులకు గతంలో యూజర్ చార్జీ రూ.35 ఉండగా, ప్రస్తుతం రూ.62కు పెంచారు. కేటగిరీ–బీ దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 ఉండగా, ఇక నుంచి రూ.80 వసూలు చేస్తారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం కూడా మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. ప్రభుత్వం యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడంపై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సేవలకు తాత్కాలిక అంతరాయం
జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగుతాయని తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం చేపట్టే ఈ–నిర్వహణ ప్రక్రియతో అన్ని ఆన్‌లౌన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్‌పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తామని వివరించారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని సూచించారు. ఈ–నిర్వహణ పూర్తయ్యాక వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. ఇక మీ సేవ కేంద్రాల్లో సర్వీసు చార్జీలను పెంచినట్లు తెలిపారు. అదనంగా కరెంటు బిల్లులు, ఈ–పాస్ సేవలు, బయోమెట్రిక్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలకు కూడా సవరించిన చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు.


