ఎఫ్‌డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్‌

Feb 8 2026 4:13 AM | Updated on Feb 8 2026 4:13 AM

ఎఫ్‌డ

ఎఫ్‌డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్‌

చుంచుపల్లి: ఏసీబీ కేసులో నిందితురాలిగా ఉండి పరారైన కొత్తగూడెం ఫారెస్టు డెవలఫ్‌మెంట్‌ కార్పొరేషన్‌ డివిజనల్‌ మేనేజర్‌ తాటి శ్రీ శ్రావణిని శనివారం అరెస్ట్‌ చేశారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌, ఇతర అధికారులు విశాఖపట్నంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జమాయిల్‌ కటింగ్‌ విషయంలో రూ. 28 లక్షలు డిమాండ్‌ చేసిన ప్లాంటేషన్‌ మేనేజర్‌ రాజేందర్‌ కుమార్‌, మధ్యవర్తి ద్వారా రూ. 3.50 లక్షలు లంచంగా తీసుకుంటున్న సందర్భంలో చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో జనవరి 3న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ. 28 లక్షలు డిమాండ్‌ చేశారు. అదే రోజు ప్లాంటేషన్‌ మేనేజర్‌ను ఏసీబీ బృందం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా, అప్పటి నుంచి డివిజనల్‌ అధికారి శ్రావణి మాత్రం పరారీలోనే ఉన్నారు. ఏసీబీ నిఘా పెట్టి విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్‌కు కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న శ్రావణిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు అటవీ అభివృద్ధి సంస్థలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మొక్కజొన్న లోడ్‌ లారీ బోల్తా

ఇల్లెందురూరల్‌: గుండాల నుంచి శెట్టుపల్లి మీదుగా ఇల్లెందుకు వస్తున్న మొక్కజొన్న లోడ్‌ లారీ శనివారం మండలంలోని పోచారంతండా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. కొమరారం ఎస్సై నాగుల్‌మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

మద్దుకూరులో చోరీ

చండ్రుగొండ : మండలంలోని మద్దుకూరు గ్రామంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మద్దుకూరులోని డబుల్‌ బెడ్‌రూం కాలనీలో నివాసం ఉండే పొలెబోయిన కల్యాణి ఇంట్లో ఈ నెల 4న మధ్యాహ్నం చోరీ జరిగింది. తలుపు, తాళం పగలగొట్టిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. నాలుగు గ్రాముల బంగారు ఆభరణం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ. 35 వేల నగదు అపహరించారు. ఆ సమయంలో కల్యాణి వ్యవసాయ పనులకు, ఆమె కుమారుడు పాఠశాలకు వెళ్లారు. మొత్తం రూ. 58,500 విలువైన సొత్తు చోరీ జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం బంగారం, వెండి, నగదు కలిపి రూ. 1.70 లక్షలు ఉంటుందని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతున్న యువకుడి మృతి

సోదరుడిపై హత్య కేసు నమోదు

అశ్వాపురం: కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో మండల కేంద్రంలోని చవిటిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రాజేష్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాతిక విజయ్‌(25) రెండేళ్లుగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నాడు. ఈ నెల 6న అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లితో గొడవపడి కొట్టాడు. దీంతో పక్కనే ఉన్న విజయ్‌ సోదరుడు అరుణ్‌ కుమార్‌ మంచంకోడుతో దాడి చేశాడు. దీంతో విజయ్‌కు తీవ్రగాయాలు కాగా, మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు అరుణ్‌కుమార్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్‌ తెలిపారు.

ఎఫ్‌డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్‌1
1/1

ఎఫ్‌డీసీ డీఎం శ్రీశ్రావణి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement