రామాలయంలో వైభవంగా గోదా కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గోదారంగనాథ స్వామి వారి కల్యాణం బుధవారం నేత్రపర్వంగా సాగింది. అలాగే బేడా మండపంలో శ్రీ సీతారాముల నిత్యకల్యాణ వేడుక కూడా నిర్వహించారు. తొలుత స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సంక్రాంతి సెలవు రోజులు కావడంతో దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేడు రామయ్యకు రథోత్సవం


