సమన్వయంతో పని చేయండి
● జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి ● డీఈఓ నాగలక్ష్మి సూచన
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి నిర్వహించే అండర్ –17 జాతీయస్థాయి కబడ్డీ పోటీల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఈఓ నాగలక్ష్మి సూచించారు. ఈ బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. పోటీల నిర్వహణకు అధికారులతో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారుల రవాణా, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంఈఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


