‘ఆది కర్మయోగి’ లఘు చిత్రానికి ప్రశంస
చర్ల: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్, షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు రూపొందించిన ఆది కర్మ యోగి లఘు చిత్రం ప్రశంసలు అందుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లఘు చిత్రానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు సమక్షంలో ప్రశంసాపత్రం అందజేశారు. లఘు చిత్రానికి లక్ష్మణ్‌కుమార్ దర్శకత్వం వహించగా, సరవనన్ నిర్మాతగా వ్యవహరించారు. కోర్సా శివప్రసాద్, కారం వైష్ణవి, మడివి మహేష్, తెల్లం కవిత, మీడియం అర్జున్, మునగల నానాజీ, దుబ్బ వినోద్, కుంజ అశోక్ తదితరులు నటించారు.
అనుమతిలేని వ్యాపారులకు జరిమానా
ఇల్లెందు: లైసెన్స్ లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు మార్కెటింగ్ శాఖ అధికారులు జరిమానా విధించారు. సోమవారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సుచిత్ర, మూడో గ్రేడ్ కార్యదర్శి నరేష్‌కుమార్ ఇల్లెందు, రొపేడులలో తనిఖీలు చేపట్టారు. అనుమతుల్లేని రైస్ మిల్లులు, ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్ల దుకాణాలను సోదా చేశారు. ఓ వ్యాపారికి, రూ.16,800, మరో వ్యాపారికి రూ. 10 వేలు జరిమానా విధించారు. ఇతర వ్యాపారుల గోదాంలను తనిఖీ చేసి సరుకు స్టాక్, రికార్డులను పరిశీలించారు. రికార్డు రాయని వ్యాపారులకు నోటీస్‌లు జారీ చేశారు. కాగా మార్కెట్ అధికారులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు, ఇదే తరహాలో జరిమానాలు విధిస్తే ఏసీబీ ట్రాప్ చేయిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అటవీశాఖ ఉద్యోగి ఇంట్లో
అక్రమంగా కలప నిల్వ
● స్వాధీనం చేసుకున్న అధికారులు
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామంలో ఓ అటవీ ఉద్యోగి నివాసంలో నిల్వ చేసిన కలపను అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. అటవీ ఉద్యోగి తన నివాసంలో టేకు, నారవేప దుంగలను నిల్వ చేసినట్లు సమాచారం తెలియడంతో అధికారులు దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న కలపను జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయానికి తరలించారు. స్థానిక అటవీ నర్సరీలో ఎండిపోయిన టేకు చెట్లను కోసి సైజు దుంగలు, నారవేప దుంగలను అటవీ ఉద్యోగి తన ఇంట్లో దాచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావును వివరణ కోరగా.. అటవీ ఉద్యోగి ఇంట్లో నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
‘ఆది కర్మయోగి’ లఘు చిత్రానికి ప్రశంస


