ఎదగని వరినారు
ప్రభావం చూపుతున్న
చలి, ఉష్ణోగ్రతలు, మంచు
యాసంగిలో వరినాట్లు
ఆలస్యమయ్యే పరిస్థితులు
దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన
చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో వరినారుపై తీవ్రప్రభావం పడుతుంది. రైతులు సాయంత్రం నారు మళ్లలోని నీటిని బయటకు వదిలేయాలి. రాత్రి వేళ నారుమళ్లలో నీరు ఉంచకూడదు. ఉదయం కొత్తనీరు పెట్టుకోవాలి. చలి వల్ల జింక్ లోపం వచ్చే అవకాశాలున్నాయి. దీని నివారణకు జింక్‌ను నారుపై పిచికారీ చేయాలి. వీలైతే మంచు పడకుండా టార్పాలిన్లు, కవర్లు కప్పుకుంటే నారు తొందరగా ఎదుగుతుంది.
– బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు డివిజన్
బూర్గంపాడు: పదిహేను రోజులుగా పెరుగుతున్న చలి, రాత్రి వేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కురుస్తున్న మంచు వరినారుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నారు ఎదగకపోవడంతో వరినాట్లు ఆలస్యమవుతున్నాయి. రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. యాసంగిలో జిల్లాలో 80వేల ఎకరాల్లో వరిసాగు చేయనున్నారు. వరినారు పోసిన రైతులు నాట్లు వేసుకునేందుకు భూములు సిద్ధం చేసుకున్నారు. అక్కడక్కడా నాట్లు మొదలుపెట్టారు. నారు పోశాక 25 రోజుల నుంచి నాటు వేస్తారు. ప్రస్తుతం 25రోజులు దాటినా వరినారు నాట్లు వేసే దశకు చేరలేదు. చలి తీవ్రత, మంచు ప్రభావంతో ఎదగలేదు. చలితో నారు సరిగా మొలకెత్తలేదు. మొలిచినా చలితీవ్రతతో పసుపు రంగులోకి మారి ఎర్రబడుతోంది. వెరసి యాసంగి వరినాట్లు పదిహేను రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.
నెలరోజుల్లోపు నాటితేనే దిగుబడి
యాసంగిలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వరినారు నెలరోజుల్లోపు, లేత దశలో నాటుకుంటేనే సరైన దిగుబడి వస్తుంది. వరి నాటాక నెలరోజుల వ్యవధిలోనే దుబ్బు చేస్తుంది. నాట్లు ఆలస్యమైతే దుబ్బు చేసే కాలం తగ్గి, దుబ్బు సరిగ్గా చేయదు. చీడపీడలు కూడా ఆశిస్తాయి. దీంతో దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత నుంచి వరినారును కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో నీరు నిల్వ ఉండకుండా చేస్తున్నారు. ఎరువులు వేస్తే నారు ఎదిగేందుకు గ్రోత్ ప్రమోటర్లను పిచికారీ చేస్తున్నారు. కొందరు రైతులు నారుమళ్లలో నీటిని ఉదయం, సాయంత్రం మారుస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులతో నారు అనుకున్న స్థాయిలో ఎదగడంలేదు.
ఎదగని వరినారు


