అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి
రుద్రంపూర్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ నెల 27తో పూర్తయిందని, మళ్లీ ఎన్నికలు జరిగే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని హెచ్‌ఎంఎస్ అద్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2024లో గుర్తింపు సంఘం ఎన్నికకు సంబంధించిన హక్కు పత్రాలు అందాయని, అప్పటి నుంచి రెండేళ్ల (2026 సెప్టెంబర్ ) వరకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా చెలామణి అవుతాయని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఉవ్విళ్లు ఊరుతున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ప్రోటోకాల్ అమలు చేశారని, దీని వల్ల గడువు పూర్తయిందని వివరించారు. ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ. 47 వేల కోట్లను వసూలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో వై.ఆంజనేయులు, ఎం శ్రీనివాస్, ఎండీ.ఆసీఫ్, బి. సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
దుమ్ముగూడెం : మండలంలోని గౌరారం బాలికల ఆశ్రమ పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు తోలం శ్రీనివాసరావు లాంగ్ జంప్‌లో రజత, 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాఽధించాడు. ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆయన ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును హెచ్‌ఎం మడకం మోతీరు తదితరులు అభినందించారు.
భద్రాద్రికి భక్తుల పాదయాత్ర
భద్రాచలంటౌన్: ఎన్టీఆర్ జిల్లా సత్యలపాడు మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన సుమారు 550 మంది రామభక్తులు సోమవారం పాదయాత్రగా శ్రీసీతారామచంద్ర స్వామివారిని పల్లకీలో మోసుకుంటూ భద్రాచలం చేరుకున్నారు. ఈ నెల 25న గంపలగూడెం నుంచి బయలుదేదారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో మహిళలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
4న పెరిక సంఘం సమావేశం
కరకగూడెం: జిల్లా పురగిరి క్షత్రియ (పెరిక) సంఘం నూతన కమిటీ ఎన్నిక, సర్వసభ్య సమావేశం జనవరి 4న పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద గల భవానీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి ముత్తయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రంగారావు తెలిపారు. సోమవారం కరకగూడెం మండలంలోని అనంతారం, కరకగూడెం, భట్టుపల్లి గ్రామాల్లో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు అంకతి ఉమామహేశ్వరరావు, పూజారి వెంకటేశ్వర్లు, తిప్పని శ్రీనివాసరావు, అంకతి మల్లి కార్జున్ రావు, చిట్టి వెంకటేశ్వర్లు, అత్తె నాగేశ్వరరావు, కొమ్మ ప్రసాద్, అత్తె సత్యం, బాలరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
3,189 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 3,189.42 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,499.42 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 450 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 1,040 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిగతా మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసిన ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేనెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్లను సోమవారం గిరిప్రసాద్ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే సభకు ఐదు లక్షల మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి పార్టీకి ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులతో పాటు40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, 19, 20వ తేదీల్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలి పారు. కాగా, బహిరంగ సభ విజయవంతానికి ఖమ్మంలోని పలు కూడళ్లలో ప్రచారం చేయగా సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌కే.జానీమియా మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు మహ్మద్ సలాం, యానాలి సాంబశివరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్, యాకన్న, ఆరెంపుల సతీష్, పాల్గొన్నారు.


