
బీజీ కొత్తూరులో ‘నవోదయ’
● 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు ● త్వరలోనే విద్యాలయ భవనం పనులు ప్రారంభించేందుకు కసరత్తు
అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరులో జవ హర్‌నవోదయ విద్యాలయం ఏర్పాటు కానుంది. నవో దయ విద్యాలయం నిర్మాణానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఇటీవల సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం కన్సల్టెంట్ టెండర్లు పూర్తి కాగా సుమారు రూ.70 కోట్లతో విద్యాలయం భవనం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో తొలి నవోదయ విద్యాలయం..
అప్పట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయం ఉండగా తరువా త భద్రాచలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. రాష్ట్రవిభజనలో అది ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లగా జిల్లాలో నవోదయ విద్యాలయం లేకుండాపోయింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నవోదయ విద్యాలయం ఏర్పాటుతో జిల్లాలో తొలి నవోదయ విద్యాలయం కానుంది.
2022లో మంజూరు..
గత ప్రభుత్వ హయాంలో 2022లో కేంద్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేసింది. పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం బీజీ కొత్తూ రు వద్ద నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయా లని భావించారు. బీజీ కొత్తూరులో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించి విద్యాలయానికి కేటాయిస్తూ సంబంధిత అధికారులకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు భూమిని సందర్శించారు. బీజీ కొత్తూరు నుంచి నవోదయ విద్యాలయం వరకు రూ.1.50 కోట్లతో రహదారికి అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటవుతుందా లేదా ఇతర ప్రాంతాలకు తరలిస్తారా అన్న సందేహాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. గతంలో గుర్తించిన 30 ఎకరాల భూమినే నవోదయ విద్యాలయానికి కేటాయిస్తూ భూమిని అప్పగించడంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు కల నెరవేరబోతోందని ఈ ప్రాంత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది నుంచే తరగతులు..
ఈ ఏడాది నుంచే జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం కానుంది. తొలుత ఆరో తరగతిలో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఎంపికై న విద్యార్థులకు కరకగూడెంలో తాత్కాలికంగా ఓ అద్దె భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. బీజీ కొత్తూరు వద్ద విద్యాలయం నిర్మాణ పనులు పూర్తి కాగానే తరువాత విద్యాలయాన్ని ఇక్కడికి తరలిస్తారు.