
ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఫలితం
ఇల్లెందురూరల్: ఆత్మవిశ్వాసంతో చేసే ఏ ప్రయత్నమైనా సత్ఫలితాన్నిస్తుందని డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. మండలంలోని సుదిమళ్ల రైతువేదికలో బుధవారం ఆకాంక్ష మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రసంగించారు. రుణాల మంజూరు ద్వారా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలను ప్రభుత్వం పోత్సహిస్తోందన్నారు. స్థానిక లభించే ముడిసరుకులతో తయారు చేసిన ఉత్పత్తులను మూడు రోజులపాటు నిర్వహించే మేళాలలో ప్రదర్శించాలని సూచించారు. కేవలం మార్కెటింగ్ ప్రయోజనాలు ఆశించి మాత్రమే కాకుండా స్వయం సహాయ సంఘాల సభ్యుల ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు ఆకాంక్ష మేళా ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ఆర్థికాభివృద్ధి, సంఘాల బలోపేతం కోసం కృషి చేసిన పలువురు ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, ఎంపీడీఓ ధన్‌సింగ్, ఏఓ సతీశ్, డీపీఎం సమ్మక్క, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, మహిళా సమాఖ్యల అధ్యక్షులు తోలం శారద, అనిత, ఏపీఎంలు దుర్గారావు, అనిల్‌కుమార్, సీసీలు పాల్గొన్నారు.