
గనుల్లో వనాలు..
సీఎండీ నాటిన మొక్కల వివరాలిలా..
ఏడాది నాటిన మొక్కలు
2019 6,376
2020 3,686
2121 2,901
2022 2,580
2023 2,508
2024 891
2025 1,063
(జూలై 29 వరకు)
మొత్తం 20,005
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాధారణంగా దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాల్లోనే బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. దీంతో ఈ బొగ్గును వెలికి తీసేందుకు వందల హెక్టార్ల అడవుల్లో మైనింగ్ చేయక తప్పదు. ఫలితంగా ప్రతీ ఏటా అడవులను నష్టపోతుండగా దీన్ని భర్తీ చేసేందుకు గనులు మూసి వేసిన ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని, ఇది మైనింగ్ సంస్థల సామాజిక బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. 1984 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే ఆరంభంలో మొక్కలు నాటే కార్యక్రమం అరకొరగానే జరిగినా.. గత ఐదారేళ్లుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. మూసి వేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్‌లు, పని ప్రదేశాలు, లీజు స్థలాలు, కార్మిక వాడలు.. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో మియావాకీ, సీడ్‌బాల్స్, అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా భారీగా మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో హరితహారం, వనమహోత్సవం, వృక్షరూపం అభియాన్ తదితర కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు సింగరేణి సంస్థ స్వయంగా నాటినవి, పంపిణీ చేసినవి కలిపితే 5.47 కోట్ల మొక్కలుగా సంస్థ రికార్డులు తెలుపుతున్నాయి.
అడవులుగా మారుస్తున్నారు..
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల కారణంగా తవ్వి తీసే ఓవర్ బర్డెన్ ఒకప్పుడు ఎత్తయిన మట్టి గుట్టలుగా కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా సింగరేణి సంస్థ నిర్విరామంగా నాటుతున్న మొక్కలతో ఈ మట్టిగుట్టలు పచ్చ రంగు సంతరించుకున్నాయి. నాటిన మొక్కలు ఏపుగా ఎదిగేందుకు ట్రీ గార్డ్‌ల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా వేసవిలో ఎండు ఆకుల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. గని ప్రదేశాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అవసరమైన చోట డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరందిస్తున్నారు. దీంతో సంస్థ పరిధిలోని ప్రతీ ఏరియాలో మూతబడిన గనులు ఇప్పుడు మినీ అడవులను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు 15,231 హెక్టార్లలో మొక్కలు నాటినట్టు సంస్థ వెల్లడించింది.
తేనెటీగల పెంపకం..
జీవవైవిధ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం గౌతమ్ ఖని ఓపె న్ కాస్ట్ వద్ద 20 హెక్టార్లలో రూ.4.76 కోట్ల వ్యయంతో ఎకో బయోడైవర్సిటీ పార్క్‌ను సంస్థ సిద్ధం చేసింది. ఇక్కడ చేపట్టిన తేనెటీగల పెంపకం కార్యక్రమం విజయవంతం కావడం పర్యావరణ పరిరక్షణకు సంస్థ తీసుకుంటున్న చర్యలకు మచ్చుతునకగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర ఏరియాల్లోనూ ఎకో పార్కులు అభివృద్ధి చేయనున్నారు.
ట్రీమ్యాన్‌గా సీఎండీ..
నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకుంటే సానుకూల ఫలితాలు సాఽధించడం కష్టం. ప్రస్తుత సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్‌కు స్వతహాగా వనాలంటే ఇష్టం. దీంతో గత ఆరేళ్లుగా సింగరేణిలో మొక్కలు నాటే కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆయన డైరెక్టర్ (పా)గా ఉన్నప్పుడు 2019 జూన్ 5న ఒకేరోజు 108 మొక్కలు నాటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశం వచ్చిన ప్రతీసారి భారీగా మొక్కలను నాటుతూనే ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కొత్తగూడెం ఏరియాలో 225 మొక్కలు నాటగా.. బలరామ్ ఒక్కరే 20 వేల మొక్కలు నాటిన ఘనత సాధించారు. దేశం మొత్తంలో సివిల్ సర్వీసెస్‌లో ఉన్న వారిలో స్వయంగా 20 వేల మొక్కలు నాటిన ఏకై క అధికారిగా బలరామ్‌నాయక్ నిలిచారు.
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుతున్న సింగరేణి
ఆరు జిల్లాల పరిధిలో 15వేల హెక్టార్లలో పెరిగిన చెట్లు
అడవులను తలపిస్తున్న మూతబడిన గనులు
సింగరేణి వనాల్లో సత్ఫలితాలిస్తున్న తేనెటీగల పెంపకం
స్వయంగా 20 వేల మొక్కలు నాటిన సీఎండీ బలరామ్
ఒక మొక్క.. పది మంది కుమారులతో సమానం
సింగరేణి(కొత్తగూడెం): నాటే ప్రతీ మొక్క పది మంది కుమారులతో సమానమవని.. కుమారుల మాదిరిగానే మొక్కలు అండగా నిలుస్తాయని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌నాయక్ తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్ యార్డ్‌పై మంగళవారం ఆయన ఒక్కరే 225 మొక్కలు నాటారు. దేశంలో ఇప్పటివరకు ఆరేళ్లలో 20వేల మొక్కలు నాటిన సివిల్ సర్వీసెస్ అధికారిగా రికార్డు నమోదు కావడంతో విశ్వగురువు వరల్డ్ రికార్డ్‌లో చోటు కల్పిస్తూ సంస్థ ప్రతినిధి సత్యవోలు రాంబాబు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ మొక్కలు నాటడంలో ముందు వరుసలో నిలుస్తోందని అన్నారు. అనంతరం డైరెక్టర్లు గౌతం పొట్రు, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణరావు, జీఎంలు శాలేం రాజు, సుభానీ అధికారులు, యూనియన్ల నాయకులు సీఎండీని సన్మానించగా గత ఆరేళ్లలో సింగరేణి ఏరియాల్లో నాటిన మొక్కల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

గనుల్లో వనాలు..

గనుల్లో వనాలు..

గనుల్లో వనాలు..