మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

Jul 31 2025 7:34 AM | Updated on Jul 31 2025 8:18 AM

మణుగూ

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

మణుగూరుటౌన్‌: మండలంలో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ బుధవారం పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయం, భవిత సెంటర్‌, ఐకేపీ, పగిడేరులోని జియోథర్మల్‌ ప్రాజెక్ట్‌లను పరిశీలించారు. గుట్లమల్లారంలోని రైతు వేదికలో రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌, విద్య, గిరిజన సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, ప్లానింగ్‌, అటవీ, పరిశ్రమలు, రవాణా వంటి అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేశ్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏడీఏ తాతారావు, ఐకేపీ ఏపీఎం అహ్మదుల్లా, ఏఓ లక్ష్మణ్‌రావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ స్వర్ణజ్యోతి, కమిషనర్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

క్షుద్ర పూజల కలకలం

దమ్మపేట: మండలంలోని లచ్చాపురం గ్రామంలో మూడు రోడ్ల కూడలిపై క్షుద్రపూజల చేసిన ఆనవాళ్లు ఉండటం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున చూసిన గ్రామస్తులు భయాందోళన చెందారు. రోడ్డుపై ఓ సంచిలో చనిపోయిన నల్ల కోడి, కొబ్బరికాయలు, మట్టిబొమ్మ, పసుపు, కుంకుమ, ఉప్పు ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి క్షుద్రపూజ లు నిర్వహించిన అనంతరం సామగ్రిని రోడ్డుపై పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ సామగ్రిని అదే ప్రదేశంలో కొందరు దహనం చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రేమ జంటను వేధించిన దుండగులు

రూ.60 వేలు ఇచ్చినప్పటికీ బ్లాక్‌మెయిల్‌

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని రామాలయం పరిసర ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో వసతి కోసం రూమ్‌ తీసుకున్న ప్రేమ జంటను వీడియో తీసి ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా నుంచి అందులో ఒకరికి పంపి వేధింపులకు దిగారు దుండగులు. అలా ఇద్దరి నుంచి రూ.60 వేలు తీసుకుని ఇంకా నగదు ఇవ్వాలని వేధించడంతో ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదరు ప్రేమికులను వీడియో తీసిన వారిని పట్టుకుని అన్ని వివరాలు వెల్లడిస్తామని భద్రాచలం టౌన్‌ పోలీసులు తెలిపారు.

పాఠశాలకు

తాళం వేసి నిరసన

టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి కాంప్లెక్స్‌ పరిధి జి.కొత్తతండా ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం తాళం వేసి ఆందోళన చేపట్టారు. నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రహరీ గోడ నిర్మించాలని, చెత్త తొలగించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎం పద్మ, టీచర్‌ పుష్పలత ఎంఈఓ జగన్‌నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. మిషన్‌ భగీరథ అధికారులు వచ్చి నీటి సదుపాయం పునరుద్ధరించారు. ఆవరణలో చెత్తను తొలగిస్తామని కార్యదర్శి కృష్ణచైతన్య హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.

గ్యాస్‌ గోదాంను

తరలించండి..

కలెక్టర్‌ను ఆదేశించిన హెచ్‌ఆర్‌సీ

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో ఏర్పాటు చేసిన గ్యాస్‌ కంపెనీ గోదాం ప్రభుత్వ పాఠశాలతో పాటు నివాసాల మధ్య ఉందని, దానిని వెంటనే తరలించాలని అశోక్‌నగర్‌ కాలనీకి చెందిన కామ అనిల్‌ 23 మార్చి 2022లో మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 14న తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌ డా.జస్టిస్‌ శమీమ్‌అక్తర్‌ సదరు గ్యాస్‌ గోదాంను ఆ ప్రాంతం నుంచి తరలించాలని, ఇందుకు సంబంధించి రానున్న రెండు నెలలలోపు (సెప్టెంబర్‌ నెలాఖరులోగా) ఆ ప్రాంతాన్ని సందర్శించి, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌1
1/2

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌2
2/2

మణుగూరులో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement