
పురోగతి లేదు..
● వీడని అవశేషాల మిస్టరీ ● రెండు నెలలు కావొస్తున్నా స్పష్టత లేదు ● ఇంకా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు
అశ్వారావుపేటరూరల్: అరుదైన, అంతరించి పోతున్న ‘కస్తూరి జింక’అవశేషాల కేసుగా ఆరోపణలు వస్తున్న కేసులో పురోగతి లేకుండా పోయింది. నెలలు గడుస్తున్నా ఈ కేసుపై అటవీశాఖ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం, ఇంకా గోప్యంగానే ఉండచడపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని వినాయకపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గత మే 26వ తేదీ అర్ధరాత్రి ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బ్యాగుల్లో దాచిన 13 అవశేషాలు గుర్తించ గా.. ఇవి బంతి అకారంలో ఉండి సువాసన వస్తుండడంతో అధికారులు కస్తూరి జింక అవశేషాలుగా అనుమానించారు. వీటి ఖరీదు కూడా లక్షల్లో ఉంటుందని, సదరు వ్యక్తి వీటిని అసాంఘిక కార్యకలపాలకు వినియోగించేందుకు సేకరించి ఉంటాడనే ప్రచారం జరిగింది. కాగా, ఈ అవశేషాలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు వాటిని నిర్ధారించేందుకు హైదారాబాద్‌లోని సీసీఎంబీ ల్యా బ్‌కు పంపించారు. 15–20 రోజుల్లో నివేదిక వస్తుందని, దీని ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. కాగా సీసీఎంబీ ల్యాబ్‌కు నిర్ధారణకు పంపించి రెండు నెలలు కావొస్తున్నా నేటికి అవశేషాలకు సంబంధించిన నివేదిక మాత్రం బయటకు వెల్లడించలేదు. దీంతో ఈ కస్తూరి జింక అవశేషాల ఘటనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అటవీశాఖ అధికారులకు అవశేషాల గురించి సమాచారం అందించిన వారికి కుడా దీనిపై ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వకపోడంపై విమర్శలు వస్తున్నాయి.
‘కస్తూరి జింక’అవశేషాలు కాదా.?
ఈ కేసు సంబంధించి అటవీశాఖ నుంచి నెలలు గడిచినా స్పష్టత రాకపోవడానికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. హైదారాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్ నుంచి ఇరవై రోజుల్లోపే అవశేషాలకు సంబంధించిన నివేదిక వస్తుందని, కొంతమంది అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, నేటికీ నివేదిక బహిర్గతం చేయకపోడం చూస్తుంటే.. సదరు వ్యక్తి ఇంట్లో దొరికిన అవశేషాలు కస్తూరి జింకవి కాదని గొర్రె పోతులకు సంబంధించిన అవశేషాలుగా నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అరుదైన కస్తూరి జింక అవశేషాలు కాకపోవడం వల్ల ఈ కేసును అటవీ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదనే ప్రచారం సాగుతోంది. దీనిపై స్థానిక ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణను వివరణ కోరగా.. అవశేషాలకు సంబంధించిన కేసుపై విచారణ సాగుతోందని, కొద్ది రోజుల్లోనే స్పష్టత ఇస్తామని తెలిపారు.