
పనులు చక చకా..
● సిద్ధమవుతున్న 100 పడకల ఆస్పత్రి ● రూ.37.50 కోట్లు.. మూడు అంతస్తుల్లో నిర్మాణం ● పూర్తయితే ప్రజల ముంగిట్లోకి ఉన్నత వైద్యం ● ఖమ్మం, కొత్తగూడెం వెళ్లకుండానే మెరుగైన చికిత్స
ఇల్లెందు: ఇల్లెందులో 100 పకడల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆస్పత్రి నిర్మాణానికి మార్చి 16న శంకుస్థాపన చేయగా.. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ)ద్వారా వైద్య విధాన పరిషత్ నిధులు రూ. 37.50 కోట్లతో పనులు చేపట్టారు. స్థల సేకరణలో జాప్యంతో మొదట్లో కొంత ఆలస్యమైనా.. ప్రస్తుతం పనుల్లో వేగం పుంజుకుంది. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే రోజూ 800 తగ్గకుండా ఓపీ, 100 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు.
నాడు 14 పడకలతో..
ఇల్లెందులో ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనాన్ని 1976 జూన్ 6న నాటి సీఎం జలగం వెంగళరావు 14 పడకలతో ప్రారంభించారు. 2009 ఫిబ్రవరి 7న అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడమే కాక, రూ.1.02 కోట్లతో నిర్మించిన కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్య రంగం అభివృద్ధి చెందింది. 2022 జనవరి 4న ఈ 30 పడకల ఆస్పత్రి(సీహెచ్‌సీ)ని వైద్య విధాన పరిషత్‌కు బదలాయించారు. ఆ తర్వాత వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరగడంతో పాటు పేషెంట్ల రాక కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ 2023 ఆగస్టు 3న రూ. 37.50 కోట్లతో నూతన భవనం మంజూరు చేసింది. అయితే నిధులు విడుదలలో జాప్యం, స్థలం అందుబాటులో లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోరం కనకయ్య.. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోఽగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల చేయించారు. సింగరేణికి చెందిన ఐదెకరాల స్థలం కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి.
మారనున్న రూపురేఖలు..
ఇల్లెందు ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి బదలాయించాక వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 12 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. 100 పడకల ఆస్పత్రిగా మారితే 30 మంది వైద్యులు, 60 మంది నర్సులతో పాటు 40 మంది ఇతర సిబ్బంది పనిచేసే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయితే ఆస్పత్రి రూపురేఖలు మారుతాయి. స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది నియామకంతో మారుమూల ప్రాంత ప్రజలకు ఉన్నత వైద్యం చేరువ కానుంది. గైనిక్, ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, ఫిజియోథెరపీ, న్యూరో, డెంటల్, ఆనస్థీషియా, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆప్తాలమీ తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏ చికిత్స కోసమైనా ఖమ్మం లేదా కొత్తగూడెం వెళ్లాల్సి వచ్చేది.
గ్రౌండ్ ఫ్లోర్.. మూడు బ్లాక్‌లు
ఇల్లెందు 100 పడకల ఆస్పత్రిని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎమర్జెన్సీ/ ట్రామా కేర్, బ్లడ్ బ్యాంక్, జనరల్ రిజిస్ట్రేషన్ ఫార్మసీ, మెడికల్ స్టోర్, డెలివరీ విభాగం, ఓపీ సెక్షన్‌లు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. పోలీస్ ఔట్ పోస్టు, 9 పడకలతో ఎమర్జెన్సీ వార్డు, ఎక్స్ రే రూం, స్టెరిలైజేషన్ రూం, డ్యూటీ డాక్టర్, డ్యూటీ నర్స్‌ల గదులతో పాటు ప్రతీ విభాగానికి ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఫిమేల్ వార్డు, ఓపీ సెక్షన్, అడ్మినిస్ట్రేషన్, రోగ నిర్ధారణ విభాగాలు ఉంటాయి. గైనకాలజీ వార్డులో 15, ఫిమేల్ మెడికల్ సర్జికల్ వార్డులో 15 పడకలు ఏర్పాటు చేస్తారు. సెకండ్ ఫ్లోర్‌లో 15 పడకలతో కూడిన మూడు వార్డులు, ఆయుష్ క్లినిక్, కంటి వైద్యం, చర్మవ్యాధుల నిపుణులు, చిన్న పిల్లల విభాగం, ఏడు బెడ్లతో ఐసీయూ, ఐసోలేషన్ తదితర విభాగాలు ఉంటాయి.
పనుల వేగం పెరిగింది..
శంకుస్థాపన చేసి, స్థలం అప్పగించాక పనుల్లో వేగం పెరిగింది. ఏ ఆటంకం లేకుండా సాగితే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం. ఇప్పటికే సుమారు 20 శాతం పనులు పూర్తయ్యాయి.
– సీహెచ్ వికాస్, ఏఈ, టీజీఎంఎస్‌ఐడీసీ