
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
రామాలయంలో ఐఎస్‌ఓ ప్రతినిధుల పరిశీలన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు దేవస్థాన రికార్డులతో పాటు పలు విభాగాల్లో సిబ్బంది పనితీరు, ప్రసాదం, ఆలయ పరిసరాల్లో విక్రయిస్తున్న వస్తువుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బృందం హెడ్ శివయ్య, ఆలయ ఈఓ రమాదేవి పాల్గొన్నారు.
ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లను అభివృద్ధి చేస్తాం
అశ్వారావుపేటరూరల్: ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లను మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రీసెర్చ్, డెవలప్‌మెంట్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ కిషన్ అన్నారు. మండలంలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద గల అటవీ పరిశోధన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రీసెర్చ్ సెంటర్‌లో రికార్డులు, సౌకర్యాలతో పాటు దమ్మపేట మండలం అల్లిగూడెం వద్ద గల ప్లాంటేషన్లను పరిశీలించారు. పరిశోధనలపై దృష్టి పెట్టడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రీసెర్చ్ సెంటర్ భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో రీసెర్చ్ సెంటర్ ఇన్‌చార్జ్ రేంజర్ జరీనా, అశ్వారావుపేట, దమ్మపేట రేంజర్లు మురళీకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
ఆలయ ఈఓకు ఉద్యోగోన్నతి
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈఓ ఎల్.రమాదేవికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఫిబ్రవరిలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు ఆలయ ఇన్‌చార్జి ఈఓగా, ఆ తర్వాత పూర్తిస్థాయి ఈఓగా బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందిన ఆమెకు ఆలయ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రమాదేవిని ఆలయ ఈఓగా కొనసాగిస్తారా, బదిలీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
సమయపాలన పాటించాలి
డీఐఈఓ వెంకటేశ్వరరావు
ములకలపల్లి : విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించాలని డీఐఈఓ హెచ్.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని లెక్చరర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫిజిక్స్ వాలా ఆన్‌లైన్ తరగతులను శ్రద్ధగా వినాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాఽధించాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కల్పన, లెక్చరర్లు పాల్గొన్నారు.
కేజీబీవీల్లో స్పాట్ అడ్మిషన్లు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం