ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీలో గురువారం పని ప్రదేశం నుంచి జారి కిందపడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం పెద్దకమలాపురం గ్రామానికి చెందిన పర్శిక హరీశ్(24) ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రాజెక్ట్ వర్క్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 20 అడుగుల ఎత్తులో పనిచేస్తుండగా, జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఐటీసీ డిస్పెన్సరీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు చిట్టిబాబు, నర్సమ్మ, కుటుంబసభ్యులు గుండెలావిసేలా రోదిస్తున్నారు. కాగా మృతుడు అవివాహితుడు. మృతుడి కుటుంబానికి ఐటీసీ ఒప్పందం ప్రకారం రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందించేందుకు కృషి చేస్తామని గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


