
బాధితులకు భరోసా..
● వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం రూ. 4 లక్షలకు పెంపు ● త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా చెల్లింపులు ● వడగాల్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా గుర్తింపు
బూర్గంపాడు/చుంచుపల్లి: వడగాడ్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రభుత్వం పరిగణించింది. వడదెబ్బతో మృత్యువాత పడిన కుటుంబాలకు అండగా నిలవనుంది. బాధిత కుటుంబాలకు అందించే పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. మండలస్థాయి కమిటీ చేసే సిఫార్సును కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక పరిహారం అందనుంది.
సకాలంలో చికిత్స అందక పలువురు మృతి
వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, హమాలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల ఆర్థికసాయమందించేది. వరుస వారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను కలెక్టర్‌కు పంపితే, అక్కడ కూడా వరుస వారీగా నిధుల లభ్యతను బట్టి సాయమందించేవారు. ఆపద్బంధు పథకానికి ప్రమాదవశాత్తు మరణించిన వారు, వివిధ కారణాలతో మృతిచెందిన వారు కూడా దరఖాస్తు చేసుకునేవారు. ఏడేనిమిదేళ్లుగా ఆపద్భందు పథకం దాదాపుగా నిలిచిందనే చెప్పాలి. సాయం అందకపోవటం, పరిహారం కూడా తక్కువ మొత్తంలో ఉండటం, పోస్టుమార్టం వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి కూడా చూపడంలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబీకులు పేర్ల నమోదుకు ముందుకొచ్చే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితేనే..
రూ.4 లక్షల పరిహారమందించటం బాధిత కుటుంబాలకు ఒకింత ఊరటనిస్తుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలో తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థత గురై ఎవరైనా మరణిస్తే తహసీల్దార్, మండల వైద్యాధికారి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను సిద్ధం చేయాలి. మృతుని కుటుంబ సభ్యులు ముందుగా ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీస్‌శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. శవ పంచనామా నివేదికల అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి, ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది.
అవగాహన కల్పిస్తున్నాం
పరిహారం పెంచడం వల్ల వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జిల్లాలో వేసవి రక్షణ చర్యలు చేపట్టాం. కొన్ని మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. వైద్యశాఖను అప్రమత్తం చేసి అవగాహన చర్యలు చేపడతాం.
– డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్
ఇటీవలి వడదెబ్బ మృతులు..
ఇల్లెందు మండలం లక్ష్మీనారాయణ తండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) గత సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు.
టేకులపల్లి మండలం మద్రాసు తండా కొండంగులబోడుకు చెందిన కేళోత్ గోబ్రియా (49) గత నెల 24న చేలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు.
పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటి రత్తాలు (55) గత నెల 15న బంధువుల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి వడదెబ్బ బారినపడి మృతి చెందింది.

బాధితులకు భరోసా..