బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌ | - | Sakshi
Sakshi News home page

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌

Apr 20 2025 1:05 AM | Updated on Apr 20 2025 1:05 AM

బాక్స

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌

బూర్గంపాడు: పల్లె, పట్టణ ప్రాంతాల శివారు భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారుతుండగా.. ఊరి బయట కాసేపు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా అక్కడ వసతులు శూన్యం. దీంతో యువత క్రీడలకు దూరమవుతోంది. ఈ తరుణంలో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బాక్స్‌ క్రికెట్‌ క్రేజ్‌ ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే బాక్స్‌ క్రికెట్‌ కోర్టులు వెలుస్తున్నాయి. మొదట ఆసక్తి చూపని యువకులు, చిన్నారులు ఇప్పుడు బాక్స్‌ క్రికెట్‌పై మోజు పెంచుకుంటున్నారు. రోజూ గంటో, రెండు గంటలో ఈ ఆట ఆడుతున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో క్రికెట్‌ ఆడడం సరికొత్త అనుభూతి ఇస్తోందని కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రూ.లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బాక్స్‌ క్రికెట్‌ కోర్టులకు ఆశించిన స్థాయిలో యువకులు రావడం లేదని నిర్వాహకులు అంటున్నారు.

జాతీయ స్థాయిలో ప్రతిభ..

జిల్లాకు చెందిన యువతీ యువకులు క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరికి సరైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉంది. పినపాక మండలానికి చెందిన తొలెం రమేష్‌ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగిడి త్రిష క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వీరితో పాటు చాలా మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అయితే జిల్లాలో సరైన క్రీడా మైదానాలు, కోచ్‌లు అందుబాటులో లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో బాక్స్‌ క్రికెట్‌ కోర్టులు క్రీడాకారులకు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయి.

కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు..

జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు భద్రాచలం, సారపాకలో ప్రస్తుతం బాక్స్‌ క్రికెట్‌ కోర్టులు నడుస్తున్నాయి. కోల్‌బెల్డ్‌ ఏరియాలైన ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లోనూ ఈ కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు బాక్స్‌ క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవులు సమీపిస్తుండడంతో విద్యార్థులు కూడా బాక్స్‌ క్రికెట్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

గ్రౌండ్‌ లేని లోటు తీరుతోంది

పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో క్రికెట్‌ ఆడేందుకు గ్రౌండ్‌ లేదు. క్రికెట్‌ ఆడాలనే ఆసక్తి ఉన్నా గ్రౌండ్‌ లేకపోవడంతో నిరుత్సాహ పడేవాళ్లం. ఇప్పుడు బాక్స్‌ క్రికెట్‌ కోర్టు అందుబాటులోకి రాడంతో ఆ ఇబ్బంది తొలగింది. ఫిట్‌నెస్‌ కోసం వారానికి నాలుగు రోజులు బాక్స్‌ క్రికెట్‌ ఆడుతున్నా.

– మాదినేని ఆకాశ్‌, సారపాక

సౌకర్యంగా ఉంది

సారపాకలో బాక్స్‌ క్రికెట్‌ కోర్టు వచ్చిన తర్వాత మిత్రులతో కలిసి రోజూ రెండు గంటల పాటు క్రికెట్‌ ఆడుతున్నాం. ఊర్లో క్రికెట్‌ గ్రౌండ్‌ లేకపోవడంతో గల్లీలోనే ఆడేవాళ్లం. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఆటలో నైపుణ్యం పెంచుకుంటున్నాం. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడడం కొత్త అనుభూతిని ఇస్తోంది.

– కన్నెదారి తరుణ్‌సాగర్‌, రెడ్డిపాలెం

జిల్లాలో వెలుస్తున్న క్రీడా కోర్టులు

ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడుతున్న యువత, చిన్నారులు

క్రీడా ప్రాంగణాలు లేక

ఇటువైపు మొగ్గు

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌1
1/2

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌2
2/2

బాక్స్‌ క్రికెట్‌కు క్రేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement