
రైతులకు న్యాయం చేయండి
● ధాన్యం అమ్మిన వారికి బోనస్ జమ కావడం లేదు.. ● మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల
దమ్మపేట : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు అందాల్సిన బోనస్ వారి ఖాతాల్లో జమ కావడం లేదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మండలంలోని గండుగులపల్లిలో తన నివాసంలో ఉన్న తుమ్మలను స్థానిక రైతులు శనివారం కలిశారు. ధాన్యం అమ్మిన తమకు ఇంకా బోనస్ జమ కాలేదని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో తుమ్మల ఉత్తమ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. కొందరు మిల్లర్లు దళారులతో కుమ్మకై ్క, రైతులకు నష్టం జరిగేలా చేస్తున్నారని, ఈ విషయంలో రైతులకు న్యాయం చేరాలని కోరారు. స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. కాగా, దమ్మపేటలోని శివాలయం ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ వంతెన ఎత్తు పెంచాలని స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిన్నశెట్టి యుగంధర్ మంత్రి తుమ్మలను కోరగా.. వంతెనకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈని ఫోన్‌లో ఆదేశించారు. రెడ్యాలపాడుకు చెందిన మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా తుమ్మల ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, దొడ్డా ప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు పాల్గొన్నారు.