
‘కొర్రమేను’ పెంపకంపై దృష్టి సారించాలి
● 5వ తేదీకి యూనిఫాం కుట్టు పనులు పూర్తి చేయాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన
అశ్వాపురం/ పాల్వంచరూరల్: కొర్రమేను చేపల పెంపకంపై రైతులు, మహిళలు దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ కొర్సా దుర్గారావు కొర్రమేను చేపల పెంపకం చేపడుతుండగా గురువారం అదనపు కలెక్టర్ సందర్శించారు. చేపల పెంపకానికి ఉపాధి హామీ పథకంలో ఉచితంగా నిర్మిస్తున్న ఫామ్‌పాండ్‌ను పరిశీలించారు. మల్లెలమడుగు, పాల్వంచ మండలం నాగారం, కేశవాపురం గ్రామాల్లోని కుట్టుమిషన్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొర్రమేను చేపల పెంపకం అశ్వాపురం మండలం మిట్టగూడెంలో జిల్లాలోనే ఆదర్శవంతంగా ఉందన్నారు. మే 5వ తేదీ నాటికి విద్యార్థుల యూనిఫాం ఒక జత చొప్పున కుట్టి అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లల వ్యక్తిగత కొలతలను, రిజిస్టర్‌లో నమోదు చేసుకుని వాటి ఆధారంగా స్టిచింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎస్‌కె.సైదులు, డీపీఎం జ్యోతి, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ ముత్యాలరావు, ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఏపీఎంలు రాంబాబు, ఏపీఎం సత్యనారాయణ, నాగార్జున, సీతరామయ్య, వెంకటేష్, మల్లేశం పాల్గొన్నారు.