
ఆదివాసీలకు మౌలిక వసతులు కల్పిస్తాం
చర్ల: సరిహద్దు ప్రాంతాల ఆదివాసీలకు విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌళిక వసతుల కల్పిస్తామని ఎస్పీ రోహిత్‌రాజు భరోసా ఇచ్చారు. మండలంలోని మారుమూల గ్రామం పూసుగుప్ప నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డును గురువారం ఆయన సందర్శించారు. చర్ల నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని పూసుగుప్ప వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన ఎస్పీ.. మధ్యలో నిర్మిస్తున్న వంతెనలు, లోలెవల్ చప్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాంపురం, బీమారంపాడు, పూజారికాంకేర్, చిన్న ఊట్లపల్లి, పెద్ద ఊట్లపల్లి తదితర గ్రామాల ఆదివాసీల కోసం రూ.3కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మించామని తెలిపారు. ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేయాలని మావోయిస్టులు చూస్తున్నారని, వారి ఆటలు చెల్లవని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ పని చేస్తున్నాయని వివరించారు. పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో త్వరలోన మొబైల్ ఆస్పత్రులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 220 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్‌కుమార్, చర్ల సీఐ రాజువర్మ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ఆర్.నర్సిరెడ్డి, పి.కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు భరోసా