
మ్యూజియం అభివృద్ధికి సహకరించాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆవరణలో నిర్మించిన గిరిజన మ్యూజియంపై భక్తులు, పర్యాటకులకు అవగాహన కల్పించాలని, మ్యూజియం అభివృద్ధికి అందరూ సహకరించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక గిరిజన భవనంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పర్ణశాల, పాపికొండల సందర్శనకు మొగ్గు చూపుతారని, అంతకంటే ముందు గిరిజన మ్యూజియాన్ని చూసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాత తరం కళాఖండాలతో పాటు వ్యవసాయ పద్ధతులు, గిరిజన వంటకాలు, పాతకాలపు ఇళ్లు, వెదురు బొమ్మలను మ్యూజియంలో ఏర్పాటు చేశామని వివరించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి అధిక చార్జీలు తీసుకోవద్దని చెప్పారు. అనంతరం మ్యూజియానికి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్