నాలుగేళ్లకే నేలమట్టమా !
● కుప్పకూలిన ‘సీతారామ’ ప్యాసేజ్ పిల్లర్ ● ఇదేం నాణ్యత అంటూ సర్వత్రా విస్మయం ● అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణ
ములకలపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువపై రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ నాలుగేళ్లకే నేటమట్టం కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. 20 రోజుల క్రితమే పిల్లర్ కూలిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. సుమారు ఏడాది కాలంగా రాకపోకలు నిలిపివేశారని రైతులు అంటున్నారు. వీకే రామవరం పంప్‌హౌస్ –2 నుంచి కమలాపురంలోని పంప్‌హౌస్ –3కు వెళ్లే ప్రధాన కాల్వపై 48.30 కిలోమీటర్ వద్ద నాలుగు పిల్లర్లతో సూపర్ ప్యాసేజ్ నిర్మించారు. రెండు పిల్లర్లు కాల్వలో, కాల్వకు కుడివైపున సిమెంట్ రివిట్‌మెంట్‌లో ఒకటి, ఎడమ పక్కన మరోకటి నిర్మించారు. ఐతే పూసుగూడెం నుండి కమలాపురం వెళ్లే ప్రధాన కాలువలో ఎడమ పక్కన పిల్లర్ కూలిపోయింది. ఇరిగేషన్ అధికారులు ఇరవై రోజుల క్రితం ఘటన జరిగిందని చెపుతున్నా, సుమారు ఏడాది క్రితమే పిల్లర్ నేటమట్టమైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈక్రమంలో అసలు పిల్లర్ ఎలా కూలింది అనే విషయంలోనూ స్పష్టత కరువైంది. పిల్లర్ కింద మట్టి కదిలి, పునాది కదలడంతో పిల్లర్ కూలిపోయిందని ఇరిగేషన్ అఽధికారులు చెపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కాలువ కుడివైపున రివిట్‌మెంట్‌లో ఉన్న పిల్లర్‌కు కూడా ప్రమాదం పొంచిఉండే అవకాశం ఉంది. ఇదే పద్ధతితో పిల్లర్ బేస్‌మెంట్ కదిలితే ఆ పిల్లర్‌కూడా కూలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గోప్యత ఎందుకో..?
ఏడాది క్రితమే పిల్లర్ నేలమట్టమైందని రైతులు అంటుండగా 20 రోజుల క్రితమే కూలిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 20 రోజులు మాత్రం గోప్యత ఎందుకు పాటించారనేది ప్రశ్నార్థకంగా మారింది. పిల్లర్‌ను పునర్నిర్మించాలని యోచిస్తున్న అధికారులు.. కూలిపోవడానికి కారణమేంటని సమగ్ర అధ్యయనం చేశారా లేక ఇష్టారీతిన పనులు సాగిస్తారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాసేజ్ నిర్మించిన కాంట్రాక్ట్ ఏజన్సీ పని మొత్తం పూర్తయ్యాక కూడా రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంటుందని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటుండగా.. అసలు పని పూర్తికాకుండానే పిల్లర్ కూలడం నాణ్యతను తెలియజేస్తోంది.
సమగ్ర విచారణ చేపట్టాలి
అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతోనే పిల్లర్ కూలిపోయింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. రూ.కోటితో నిర్మించిన ప్యాసేజ్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– నూపా భాస్కర్, మాస్‌లైన్ నాయకుడు
పనులు ప్రారంభించాం
20 రోజుల క్రితమే పిల్లర్ కూలిపోయింది. తిరిగి ఇప్పటికే పనులు ప్రారంభించాం. బేస్‌మెంట్ లోతు పెంచి, పకడ్బందీగా పిల్లర్ నిర్మిస్తాం. ప్రజాధనం వృథా కాకుండా కాంట్రాక్టరే ఖర్చు భరించేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లర్ కూలినందునే తాత్కాలికంగా ప్యాసేజ్ దారి మూసేశాం. – రాంబాబు, ఇరిగేషన్ డీఈ
నాలుగేళ్లకే నేలమట్టమా !


