● అశ్వారావుపేటలో పరీక్షించాక నిర్ధారణ ● జగన్ హయాంలో మాదిరి టన్ను ధర చెల్లించక తప్పని పరిస్థితి
అశ్వారావుపేటరూరల్: ఏపీలో రైతులు సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ గెలల ఓఈఆర్ (నూనె దిగుబడి శాతం) 19.36 శాతంగా నమోదవడంతో ఆ ప్రకారం వారికి ధర చెల్లించనున్నారు. ఏపీలోని ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలు పాతవి కావడంతో నూనె దిగుబడి శాతం కేవలం 17.30గా నమోదవుతోంది. తెలంగాణలో మాత్రం ఇది 19.36 శాతం ఉండడంతో రైతులకు టన్ను గెలలకు రూ.21 వేల చొప్పున, ఏపీ రైతులకు రూ.17 నుంచి రూ.18 వేల మధ్యే అందుతోంది. ఏపీ సీఎంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించే ఓఈఆర్ ప్రకారమే ఐదేళ్ల పాటు ధర చెల్లించారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ ఓఈఆర్ ప్రకారమే టన్ను ధర చెల్లించేలా నిర్ణయించగా రైతులకు నష్టం ఎదురవుతోంది. ఈ మేరకు రైతుల వినతితో ఏపీ గెలలను అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసి ఓఈఆర్ శాతాన్ని నిర్ధారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏపీలో రైతులు సాగు చేసిన 862 టన్నుల గెలలను బుధ, గురువారం క్రషింగ్ చేయగా 19.36 శాతంగా ఓఈఆర్ నమోదైనట్లు ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు శుక్రవారం ప్రకటించారు. ఈ ఓఈఆర్ ప్రకారం ఏపీ రైతులకు ధర చెల్లించనుండగా టన్నుకు రూ.3 వేలకు పైగా లబ్ధి జరగనుంది. కాగా, గెలల క్రషింగ్ అవకాశం కల్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా, అధికారులకు ఏపీ రైతు సంఘం నాయకులు బొబ్బా రాఘవరావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.


