కదల్లేక.. కాలిపోయి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని ఎర్రగుంట గ్రామశివారు తాలుక్‌దార్‌బంజర్‌లో బుధవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి రెండిళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. గ్రామానికి చెందిన ఎస్కే గౌస్‌పాష ఇంట్లోని విద్యుత్ స్విచ్‌బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న అందరూ లేచేసరికి మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కుటుంబీకులు కేకలు వేసుకుంటూ బయటకు పరుగెత్తారు. కానీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌస్‌పాష (35) మంటల్లో చిక్కుకున్నాడు. అగ్ని కీలలు ఇల్లంతా వ్యాపించడంతో అతన్ని బయటకు తీసుకొచ్చే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అతడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మృతుడికి భార్య హసీనా, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. కాగా మంటలు పక్కనే ఉన్న తాపీమేసీ్త్ర యాకుబ్ ఇంటికి వ్యాపించాయి. చూస్తుండగానే రెండు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. గౌస్‌పాష ఇంట్లో రూ. 30 వేలు నగదు, ఇద్దరి ఇళ్లలో సామగ్రి అగ్నికి ఆహుతైంది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటలు ఆర్పే పరిస్థితి లేకపోయింది. స్థానికుల సమాచారంతో కొత్తగూడెం నుంచి వచ్చిన ఫైరింజన్ ఇతర ఇళ్లకు నష్టం జరగకుండా మంటలను అదుపుచేసింది. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఎమ్మెల్యే జారే పరామర్శ
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఆర్‌ఐ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టం అంచనా వేశారు. తక్షణసహాయం కింద బాధిత కుటుంబాలకు చెరో రూ. 5 వేలు నగదు, 30 కేజీల బియ్యం అందించారు.
మంటల్లో వ్యక్తి సజీవ దహనం
కదల్లేక.. కాలిపోయి


