●అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్న పోలీసులు ●రవాణాకు కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు ●జిల్లా వ్యాప్తంగా గత 10 నెలల్లో 7,787.712 కేజీలు స్వాధీనం ●236 మంది నిందితులు అరెస్ట్, పరారీలో 209 మంది..
కొత్తగూడెంటౌన్: జిల్లా మీదుగా జోరుగా గంజాయి రవాణా సాగుతోంది. పోలీసులు నిఘా పెట్టినా వివిధ వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని తరలించుకుపోతున్నారు. కొన్ని సంఘటనల్లో నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు. జిల్లాలో గత 10 నెలల్లో దాదాపుగా 88 కేసులు నమోదయ్యాయి. రూ. 19,46,92,800 విలువైన 7,787.712 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా కేసుల్లో 445 మందికి సంబంధం ఉండగా, వారిలో ఇప్పటివరకు 236 మందిని అరెస్ట్ చేశారు. మరో 209 మంది పరారీలో ఉన్నారు. గత సెప్టెంబర్‌లో అధికంగా 11 కేసుల్లో 999.712 కేజీల గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. 24 మందిని అరెస్ట్ చేశారు. జూలైలో 4 కేసుల్లో 90.356 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్ట్ చేశారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నా పోలీసుల కళ్లుగప్పి గంజాయి రవాణా చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచి జిల్లాలోని చర్ల, అశ్వారావుపేట, భద్రాచలం తదితర ప్రాంతాల మీదుగా విజయవాడ, హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే గంజాయి రవాణాకు కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పూర్తిస్థాయిలో గంజాయి రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసులు విఫలమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఇటీవల కొన్ని సంఘటనలను పరిశీలిస్తే..
గత మే నెలలో అశ్వారావుపేటలో పనసలోడు ముసుగులో బొలెరో వాహనంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు రూ.83 లక్షల విలువైన 3.5 క్వింటాళ్ల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
● మే 27న కొత్తగూడెం ఓల్డ్ డిపో వద్ద డీసీఎంలో తరలిస్తున్న రూ. కోటీ 30 లక్షల విలువైన 429 కేజీలు గంజాయిని పట్టుకున్నారు.
● సెప్టెంబర్ 15న ఏఓబీ నుంచి తమిళనాడుకు అంబులెన్స్‌లో తరలిస్తున్న రూ. 2 కోట్ల విలువైన గంజాయిని కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం జాతీయరహదారిపై పట్టుకున్నారు.
● అక్టోబర్ 28న ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
● ఈ నెలలో వారంరోజుల్లో రెండు ఘటనల్లో 110.205 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, 8 మంది పరారీలో ఉన్నారు.
కేసులు నమోదు చేస్తాం
జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా పెట్టాం. గంజాయి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రవాణా చేసినా, కలిగి ఉన్నా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వివరాలు తెలిస్తే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి.
–బి.రోహిత్‌రాజు, ఎస్పీ
జోరుగా గంజాయి దందా!