గాలి, వానతో భారీ నష్టం | Sakshi
Sakshi News home page

గాలి, వానతో భారీ నష్టం

Published Tue, Apr 23 2024 8:40 AM

కొత్తగూడెంలో నేలకూలిన విద్యుత్‌ స్తంభాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో వర్షం, గాలి, దుమారాలతో విద్యుత్‌ శాఖకు, పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షం ఆగమాగం చేసింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో 13.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పినపాక మండలంలో అత్యధికంగా 61.4 మి.మీ వర్షపాతం కురిసింది. కరకగూడెంలో 11, చర్లలో 2, దుమ్ముగూడెంలో 8.2, అశ్వాపురంలో 6.2, మణుగూరులో 3.2, ఆళ్లపల్లిలో 2, గుండాలలో 1.6, ఇల్లెందులో 28, టేకులపల్లిలో 56.4, జూలూరుపాడులో 0.6, చుంచుపల్లిలో 44.8, సుజాతనగర్‌లో 10.8, కొత్తగూడెంలో 30.2, లక్ష్మీదేవిపల్లిలో 22, పాల్వంచలో 5, ములకలపల్లి మండలంలో 19.2 మి.మీ వర్షం కురిసింది.

670 ఎకరాల్లో పంటలకు నష్టం..

గాలి వాన బీభత్సానికి జిల్లాలో 285 మంది రైతులకు సంబంధించిన 670 ఎకరాల్లో పంటలకు నష్టం సంభవించింది. ఇందులో 188 మంది రైతులకు చెందిన 498 ఎకరాలల్లో వరి, 31 మంది రైతులకు సంబంధించి 68 ఎకరాల్లో జొన్న, 65 మంది రైతులకు చెందిన 103 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఒక ఎకరంలో నువ్వుల పంటకు నష్టం వాటిల్లింది.

విద్యుత్‌ శాఖకు రూ 68 లక్షల నష్టం

గాలి దుమారానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి విద్యుత్‌ లైన్‌లపై పడడంతో అవి ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా ట్రాన్స్‌ఫార్మర్లు ధెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 278 స్తంభాలకు, 48 ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం వాటిల్లింది. దీంతో పలు మండలాల్ల్లో సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా విద్యుత్‌ శాఖకు రూ. 68 లక్షల నష్టం వాటిల్లిందని ఎస్‌ఈ రమేష్‌ తెలిపారు.

జిల్లాలో సరాసరి వర్షపాతం

13.6 మి.మీ.

దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, జొన్న

పంటలు

285 మంది రైతులకు చెందిన

679 ఎకరాల్లో పంటలకు నష్టం

తెగిన విద్యుత్‌ లైన్లు, కూలిన స్తంభాలు

కరకగూడెంలో ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు
1/1

కరకగూడెంలో ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement