ఉపాధి, శిక్షణపై దృష్టి సారించాలి | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2023 12:50 AM

అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు - Sakshi

పాల్వంచ: మహిళలు ఉపాధి శిక్షణపై దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి శ్రీరామనంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక నవ లిమిటెడ్‌ మహిళా సాధికార కేంద్రంలో టైలరింగ్‌ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు అందించి ప్రసంగించారు. వృత్తి విద్యా కేంద్రం అందుబాటులో ఉండటం సువర్ణ అవకాశమని, అధునాతన పరికరాలు ఇతర శిక్షణ కేంద్రాల్లో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవ లిమిటెడ్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ డి.శ్యాంసుందర్‌, డాక్టర్‌ విహారికృష్ణ, కిశోర్‌, లలిత, అరుణ, వాసవి రాణి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు

అశ్వారావుపేటరూరల్‌: ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి చర్యలకు పాల్పడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్‌ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో శనివారం సీనియర్‌ విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను ప్రేమించాలని, గురువులను గౌరవిస్తూ ఆశయాలను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా కచ్చితమైన ప్రణాళికతో లక్ష్యాలను అందుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌ పేరుతో తోటి విద్యార్థులను వేధిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలుంటాయని, పలు కేస్‌ స్టడీలను విద్యార్థుకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్‌ వెంకన్న, ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌, ప్రొఫెసర్లు మధుసూదన్‌రెడ్డి, గోపాలకృష్ణమూర్తి, శిరీష, జమయ్మ, రమేశ్‌, రెడ్డిప్రియ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్య

అన్నపురెడ్డిపల్లి: పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబు సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కాలసాని రత్నకుమారి (28) మతిస్థిమితం లేకపోవడంతో కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలానికి కొట్టే పురుగులమందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు 108 వాహనంలో కొత్తగూడెం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిందని వారు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి సోదరుడు వీరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షాహిన తెలిపారు.

అప్పులబాధతో రైతు..

జూలూరుపాడు: అప్పులబాధ తాళలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ బుచ్చయ్య కథనం ప్రకారం.. మండలంలోని సాయిరాంతండాకు చెందిన తేజావత్‌ రాంబాబు (25) తనకు ఉన్న 3 ఎకరాల భూమితోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ నెల 24న రాంబాబు పొలానికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లి పురుగులమందు సేవించాడు. అదే గ్రామానికి చెందిన గుగులోత్‌ నరసింహ పొలం పనుల నిమిత్తం అటుగా వెళ్తుండగా రాంబాబు అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి, కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వచ్చి రాంబాబును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ బుచ్చయ్య తెలిపారు.

వృద్ధురాలి ప్రాణం తీసిన సొరకాయ

కొత్తగూడెంరూరల్‌: బిల్డింగ్‌పైన కాసిన సొరకాయను కోసేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధురాలు మరణించిన ఘటన హేమచంద్రాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని హేమచంద్రాపురం గ్రామానికి చెందిన మేకల భారతమ్మ (65) (తన కుమారుడి ఇంట్లో ఉంటోంది) ఇంటి డాబాపైన సొరకాయ కాసింది. దానిని కోసేందుకు డాబాపైకి ఎక్కుతుండగా మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది.

సర్టిఫికెట్లు అందిస్తున్న డైరెక్టర్‌ లక్ష్మి
1/1

సర్టిఫికెట్లు అందిస్తున్న డైరెక్టర్‌ లక్ష్మి

Advertisement
 
Advertisement
 
Advertisement