ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాలని తపన! | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:56 AM | Updated on Feb 25 2023 5:38 PM

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సీపీ వారియర్‌, పక్కన అధికారులు - Sakshi

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సీపీ వారియర్‌, పక్కన అధికారులు

ఖమ్మంక్రైం: ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాలనేది ఆ యువకుడి తపన. కానీ శిక్షణ పొందేందుకు ఆర్థిక స్థోమత లేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న ఆయన చివరకు పోలీసులకు పట్టుబడగా భారీ మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వివరాలను ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ శుక్రవారం వెల్లడించారు. ఖమ్మం అర్బన్‌ మండలం పాండురంగాపురానికి చెందిన సంపటి ఉమాప్రసాద్‌కు ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలనేది కల కాగా, జిమ్‌కు వెళ్తూ దేహదారుఢ్యంపై శ్రద్ధ వహించేవాడు. అయితే, పర్వతాలు అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణ అవసరమని, అందుకోసం డబ్బు చాలా ఖర్చవుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఆయన డబ్బు సంపాదనకు దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు.

రెండేళ్ల నుంచి ఉదయమంతా డాబుసరిగా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. ఖానాపురం హవేలీ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆరు, ఖమ్మం టూటౌన్‌ పరిధిలో రెండిళ్లలో దొంగతనాలు చేశాడు. దొంగిలించిన సొత్తులో నగదు, బంగారు ఆభరణాలు ఉండటంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నాక ఎవరెస్ట్‌ అధిరోహణకు శిక్షణ తీసుకోవాలని భావించాడు. ఈక్రమంలోనే జిల్లా కేంద్రంలో చోరీలు పెరుగుతుండడంతో పోలీసులు నిఘా ఏర్పాటుచేయగా, శుక్రవారం ఉదయం బైపాస్‌ రోడ్డులో సీసీఎస్‌, ఖమ్మం టూ టౌన్‌ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఉమాప్రసాద్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. ఈ సందర్భంగా నిందితుడి నుంచి రూ.42లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వారియర్‌ వెల్లడించారు.

దారి దోపిడీ ముఠా అరెస్టు

ఖమ్మం రూరల్‌ సబ్‌ డివిజన్‌లోని రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌ల్లో జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్‌లపై వెళ్తున్న వారిని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురి ముఠాను కూడా పోలీ సులు అరెస్టు చేశారు. పొన్నెకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో పగడాల విజయ్‌ అలియాస్‌ చంటి, ధంసలాపురానికి చెందిన సాదెం లక్ష్మీనారాయణ, దానవాయిగూడెంకు చెందిన షేక్‌ సైదులు, ఖమ్మంకు చెందిన షేక్‌ షబాజ్‌ అలియాస్‌ సిద్ధిఖీ అలియాస్‌ షాబు, బోనకల్‌ మండలం చినబీరవెల్లికి చెందిన పాకాలపాటి ధర్మతేజ, ఖమ్మం ప్రకాష్‌ నగర్‌కు చెందిన షేక్‌ పర్వేజ్‌, రామన్నపేటకు చెందిన పసుపులేటి సాయిగా వృత్తిరీత్యా ఆటో, కారు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, కొందరు పంక్చర్‌ షాపులు నడుపుతున్నారు.

అయితే, జల్సాలకు పడిన వీరు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాలలో ఒంటరిగా వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఈక్రమంలో 16 కేసుల్లో నిందితులైన వీరిని అరెస్టు చేసి రూ.7.50లక్షల విలువైన ఆభరణాలు, రూ.14.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.67లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న సీసీఎస్‌, ఖమ్మం నగర, రూరల్‌ పోలీసులను సీపీ వారియర్‌ అభినందించి క్యాష్‌ అవార్డులు అందజేశారు. ఈసమావేశంలో అడిసనల్‌ డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌, ఏసీపీలు రవి, గణేష్‌, బస్వారెడ్డి, సీఐలు శ్రీధర్‌, రామకృష్ణ, జితేందర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటకృష్ణ, వరాల శ్రీనివాస్‌, సురేష్‌, గిరిధర్‌రెడ్డి, సిబ్బంది గజేంద్ర, చట్టు శ్రీనివాస్‌, లింగయ్య, కోలా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement