లక్ష్మీపురం: అమెరికాతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. జొన్నా శివశంకర్, వి.భారతి, ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత రైతు సంఘం పతాకాన్ని సీనియర్ నాయకులు ఆళ్ల సాంబరెడ్డి ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ అమెరికాకు మనం చేసే ఎగుమతులపై 18 శాతంపైగా పన్నులు విధిస్తూ, అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం పన్నులు పూర్తిగా ఎత్తివేయటం వల్ల మన రైతుల ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోతాయని, రైతులు దివాళా తీస్తారన్నారు. కంపెనీలకు అనుకూలంగా చట్టాలు సవరించారని తెలిపారు. కల్తీ విత్తనాల వల్ల పంట పండకపోయినా కంపెనీలపై మూడుసార్లు వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చట్ట సవరణ చేయటం దుర్మార్గం అన్నారు. ఎరువుల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందని, పురుగుమందులు, విత్తనాల మాదిరిగా ఎరువులు కూడా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే విధానం తీసుకురాబోతుందన్నారు. రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం దివాళా తీస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ తాళ్లూరి వెంకటరత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్, సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, రిటైర్డ్ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రామకృష్ణ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, కొత్త వెంకటశివరావు, ఎం.వెంగళరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, భాస్కరరావు, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.


