పోలీసుల పక్షపాత వైఖరిని నిలదీసిన సమన్వయకర్త వరికూటి
అరెస్టుకై నా సిద్ధమని ప్రకటించడంతో దిగొచ్చిన పోలీసులు
చినపులివర్రు ఘటనలో పలువురికి నోటీసులు ఇచ్చేందుకు సుముఖత
సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్‌చార్జి, వరికూటిపై కేసులు యథాతథం
కొల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నిరసన గళమెత్తారు. సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్‌బాబు అరెస్టు వ్యవహారంలో పోలీసులు మఫ్టీలో వచ్చి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రశ్నించిన పాపానికి 32 మందిపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంపై బుధవారం కొల్లూరు పోలీసు స్టేషన్ వద్ద శాంతియుత నిరసనకు దిగారు. పోలీసులు చినపులివర్రు ఘటనలో 32 మందిపై నమోదు చేసిన కేసులో బాణాల తనీష్‌బాబును ఏ1గా, వరికూటి అశోక్‌బాబును ఏ2గా పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే ఎంతవరకై నా వెళతామంటూ పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12 .30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలిపారు.
పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలేవీ?
సోషల్ మీడియాలో ప్రశ్నించిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై వరికూటి ప్రశ్నల వర్షం కురిపించారు. మఫ్టీలో తెల్లవారుజామున బెడ్‌రూమ్‌లోకి చొరబడిన పోలీసులపై బాధితురాలు బాణాల అనూష కొల్లూరు ఎస్‌ఐ కోటేశ్వరరావు, మరో నలుగురు సిబ్బందిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. దొంగల్లా ఇళ్లలోకి చొరబడితే ప్రశ్నించిన అమాయకులపై కేసులు నమోదు చేయడం ఏ చట్టంలో ఉందని నిలదీశారు. వందలాది మంది పోలీసు బలగాలతో చినపులివర్రును ముట్టడించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యేలా చేయడం ఏ చట్టం పరిధిలోకి వస్తుందని ప్రశ్నించారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే పోలీసుల కళ్లెదుటే కొట్టుకొని, పోలీసులపైన సైతం దాడి చేస్తే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. పోలీసు వ్యవస్థను కొందరు పచ్చ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు.
చినపులివర్రు ఘటనలో 32 మందిపై నమోదైన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం తెనాలిలో జడ్జ్ ముందు హాజరుపర్చడంతో వారికి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబు కార్యకర్తలకు అండగా తనను సైతం అరెస్టు చేయాలని చేపట్టిన నిరసనతో పోలీసులు దిగొచ్చారు. కేసులు ఉన్న ఏ1 బాణాల తనీష్‌బాబు మినహా అశోక్‌బాబుతో కలిపి 28 మందికి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తనీష్ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు తాను సైతం నోటీసు స్వీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పడంతో మిగిలిని 27 మందికి పోలీసులు నోటీలసులు జారీ చేయడంతో నిరసనను ఆయన విరమించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వై. అశ్వని, నాయకులు గాదె శివరామకష్ణా రెడ్డి, పడమట శ్రీనివాసరావు, పెరికల పద్మారావు, కూచిపూడి మోషే, ఆళ్లమూడి మధు, గరిక రమేష్, గాజుల శ్రీనివాసరావు, ఈమని శంకర్, వివిద మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


