ఫ్యాప్టో పల్నాడు జిల్లా శాఖ పిలుపు
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈనెల 27వ తేదీన జరగనున్న దీక్షలో పల్నాడు జిల్లా నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి రామారావు
నరసరావుపేట ఈస్ట్: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ పోస్ట్‌ను డిప్యూటేషన్ ఆధారంగా భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లు 5 సంవత్సరాలు, ఎస్‌జీటీలు 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీజీ డిగ్రీ కలిగి ప్రకటన తేదీ నాటికి 55 సంత్సరాల వయస్సు లోపు కలిగి, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు కార్యాలయంలో అందచేయాలని కోరారు. అసంపూర్తిగా, గడువు దాటిన తరువాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబడవని స్పష్టం చేసారు.
సత్తెనపల్లి: భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన మన్నేటి గోపీకృష్ణ, భార్య ఆదిలక్ష్మి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇరువురు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి అచ్చంపేట మండలం చెరుకుంపాలెంలోని పుట్టింటికి వెళ్లడంతో గోపికృష్ణ యాసిడ్ ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం రాత్రి 11:45 గంటలకు చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
పిడుగురాళ్ల: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు డబ్బుల కోసం వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...పిడుగురాళ్లకు చెందిన హసనెన్, అల్లాబడేలు ద్విచక్ర వాహనంపై కొండమోడులోని వీరమ్మ కాలనీలోని అల్లాబడే నాయనమ్మ ఇంటికి స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా డబ్బులు తీసుకొనివచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద విద్యుత్ పోల్‌కు తగిలి షేక్ హసనెన్(19) అక్కడిక్కడే మృతి చెందగా అల్లాబడేకి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఓప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట తరలించారు. పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


