బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో శిరోరక్ష–ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి వాహనచోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 1న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘శిరో రక్ష –ప్రాణరక్ష‘ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ఆవశ్యకతపై గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హెల్మెట్‌పై అవగాహన పెంచుకోవడానికి, కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఏప్రిల్ 16 నుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలన్నారు. ఉల్లంఘించిన వారి మీద రోడ్డు భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, హెల్మెట్ అనేది చలానా తప్పించుకునే మార్గం కాకుండా వ్యక్తిగత బాధ్యతగా ధరించాలన్నారు. హెల్మెట్ అనేది ప్రాణాలను కాపాడే ఆపన్నహస్తమని, దాన్ని ఎప్పుడూ భారంగా భావించకూడదన్నారు. అతి త్వరలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. హెల్మెట్ ధరించకుండా వచ్చే వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపే అవకాశం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, ఎంటి ఆర్‌ఐ శ్రీకాంత్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్


